అఖిల్ కెరీర్ పై నాగార్జున మరోసారి స్పందించారు. చేయి అందించి, అతడి కెరీర్ లో జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని పరోక్షంగా వెల్లడించారు. అఖిల్ కెరీర్ లో గ్యాప్స్ కు తను కారణం కాదని కూడా తెలిపారు.
“అఖిల్ కెరీర్ లో గ్యాప్ కు నేను కారణం కాదు. నా మూలంగా వాడు సినిమాలు తగ్గించడం లేదు. అది వాడి ఛాయిస్. ఏదో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. వాడి ప్రయత్నం వాడ్ని చేయనివ్వండి. నాకు నా 18 ఏళ్ల వయసు నుంచి నాన్నగారు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కెరీర్ లో ఏం చేయాలనుకుంటే అది చేయమన్నారు. వెనక నేనున్నాను ధైర్యంగా ముందుకెళ్లమని చెప్పేవారు. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. అఖిల్ కు తనకంటూ ఓ జర్నీ ఉంది.”
వ్యక్తిగతంగా అఖిల్ చాలా ఎదిగాడని అంటున్నారు నాగ్. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడిన విధానం అతడి ఎదుగుదలను సూచిస్తుందని, అలా కూల్ గా ఉండడం అమల దగ్గర్నుంచి నేర్చుకున్నాడని అన్నారు.
నాగ్ మాటల్లో అంతరార్థాన్ని గమనిస్తే, అఖిల్ కు ఆయన మరింత సమయం ఇచ్చినట్టు కనిపిస్తోంది. స్వీయ అనుభవాలతో నాగచైతన్య ఎలాగైతే రాటుదేలాడో, అదే విధంగా అఖిల్ కూడా తయారవుతాడనేది నాగార్జున భావన. ఈ విషయాన్ని అక్కినేని ఫ్యాన్స్ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.