ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది గుంటూరుకారం సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మ్యాగ్జిమమ్ ఎన్ని వీలైతే అన్ని స్క్రీన్స్ ఇచ్చేశారు. హనుమాన్ సినిమా వేయాల్సిన థియేటర్లలో కూడా గుంటూరుకారం వేశారు. అలా మొదటి రోజు భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు దారణంగా పడిపోయింది.
మేకర్స్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే చూసుకుంటే.. గుంటూరుకారం సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు. తాజాగా 2 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు 2 రోజుల్లో.. రూ. 127 కోట్లు గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు.
అంటే, ఈ సినిమాకు రెండో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.33 కోట్లు మాత్రమే వచ్చాయన్నమాట. మొదటి రోజు వసూళ్లతో పోల్చి చూస్తే, మూడో వంతుకు వసూళ్లు పడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి కారణాలు కూడా స్పష్టం.
గుంటూరుకారం సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం ఒక కారణమైతే.. ఆ సినిమా తర్వాత వచ్చిన సైంధవ్ తో థియేటర్లు షేర్ చేసుకోవడం మరో కారణం. అందుకే వసూళ్లలో భారీ తగ్గుదల కనిపించింది.
ఇవే సహేతుకమైన కారణాలు అనుకుంటే, గుంటూరుకారం సినిమాకు మూడో రోజు మరింతగా వసూళ్లు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, మూడో రోజుకు నా సామిరంగ సినిమాతో థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఫిలింఛాంబర్ చొరవతో, అటు హను-మాన్ సినిమాకు కూడా భారీగా స్క్రీన్స్ వెళ్లిపోయాయి.