Advertisement

Advertisement


Home > Movies - Reviews

Naa Saami Ranga Review: మూవీ రివ్యూ: నా సామి రంగ

Naa Saami Ranga Review: మూవీ రివ్యూ: నా సామి రంగ

చిత్రం: నా సామి రంగ
రేటింగ్: 2.5/5
నటీనటులు:
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆశికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్, రావు రమేష్, మధు సింగంపల్లి, రవివర్మ, నాజర్ తదితరులు
కెమెరా: దాశరథి శివేంద్ర 
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సంగీతం: కీరవాణి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: విజయ్ బిన్ని 
విడుదల తేదీ: 14 జనవరి 2024

ఈ పండగ సీజన్లో సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించే ట్రైలరుతో "నా సామిరంగ" అంటూ ముందుకొచ్చాడు నాగార్జున. ఇది 2019 నాటి మళయాళ చిత్రం పొరింజు మరియం జోస్ కి రీమేక్. 

1963 లో కథ మొదలయ్యి సుమారు పది నిమిషాలయ్యక 1988 దగ్గర ఆగి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది.

కిష్టయ్య (నాగార్జున) కి అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) సొంత తమ్ముళ్లలా ఉంటారు.

ఇతనికి వరాలు (ఆషికా) అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆమె వరదరాజు (రావు రమేష్) అనే ధనవంతుడి కూతురు.

కిష్టయ్యకి పెద్దయ్య (నాజర్) అంటే గౌరవం, విశ్వాసం. అనాధైన తనకి పెద్దయ్యే పెద్దదిక్కుగా ఉంటాడు.

తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వరాలు కిష్టయ్యని పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. అనుకోని సంఘటనలో వరదరాజు చనిపోతాడు. తండ్రి చావుకి కారణం తన ప్రేమే అని నమ్మి కిష్టయ్యని దూరం పెడుతుంది వరాలు.

ఇదిలా ఉంటే అంజి అప్పటికే మంగ (మిర్ణా) ని పెళ్లి చేసుకుని ఒక పాపకి తండ్రి కూడా అవుతాడు. భాస్కర్ (రాజ్ తరుణ్) కి మరొక ఆసామి కూతురు (రుక్సర్) లవర్.

మొత్తానికి పెద్దయ్య మూడో కొడుకు దాసు (షబ్బీర్) తొమ్మిదేళ్ల తర్వాత ఆ ఊరికొచ్చి వరాలు మీద కన్నేస్తాడు. అక్కడి నుంచి ఏమౌతుందనేది కథ. 

ఒక భాషలో ఫలానా చిత్రం అద్భుతంగా ఉందని దానిని మరొక భాషలోకి తెచ్చినప్పుడు ఆ అద్భుతం రిపీటవ్వడం చాలా అరుదు. ఎక్కడో "దృశ్యం" లాంటి సినిమా తప్ప యథాతథంగా తీస్తే ఆడవు. అందుకే కమర్షియల్ కారణాల కోసం మార్పులు చేస్తుంటారు. అయితే ఏది మార్చాలి, ఎంతవరకూ ఒరిజినల్లోని పార్ట్ ని యథాతథంగా తీయాలి అనే నిర్ణయం దర్శకుడు తీసుకోవడంలోనే రీమేక్ చిత్రాల గెలుపోటములుంటాయి. 

మళయాళ మాతృకని కొద్దిగా మార్చి సంక్రాంతి బ్యాక్ డ్రాప్ పెట్టి, హీరో బిల్డప్పులు తగిలించి, క్లైమాక్స్ మార్చి తెలుగు కమర్షియల్ కిచిడీగా వండిన చిత్రమిది. 

అల్లరినరేష్, రాజ్ తరుణ్ లాంటి మంచి టైమింగున్న నటుల్ని పెట్టుకున్నప్పుడు వాళ్లతో బోలెడంత హ్యూమర్ పండించొచ్చు. కానీ ఆ దిశగా మార్పులేవీ చేయకుండా ఒరిజినల్లో ఉన్న ట్రాకునే నడిపారు. పాటలు, రొమాన్స్ కలగలిపి వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. 

సినిమా మొదలై ముప్పావుగంటైనా అసలు కాన్-ఫ్లిక్ట్ పాయింటేంటో తేలదు. తెర మీద అలా సన్నివేశాలు కదులుతూ ఉంటాయి. డైలాగులు వీక్ గా ఉండడం వల్ల ఎక్కడా ఎంగేజవ్వడానికి చాన్స్ లేకుండా పోయింది. ప్రతి సీన్ కి ఒక లక్ష్యం, ఆడియన్స్ కి ఆసక్తి పెంచేలా చేసే కథనం ఇందులో లేవు. ఏ సన్నివేశమూ పాకాన పడకుండానే వేరే సీన్లోకి వెళ్లిపోతుంటుంది. 

ఉన్న సీన్లు, డైలాగులు అన్నీ పాత చింతకాయలాగానే ఉన్నాయి. సినిమా 1963, 1988 బ్యాక్డ్రాప్ అయినంత మాత్రాన ఔట్ డేటెడ్ సంభాషణలు రాసుకోమని కాదు కదా! 

సాంకేతికంగా ఈ సినిమాకి కెమెరా వర్క్ ఒక్కటీ బాగుందనిపిస్తుంది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. పాటల్లో "ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే..." హాంటింగ్ గా బాగుంది. 

నాగార్జున ఫిజిక్ పరంగా తన అసలు వయసుకి 25 ఏళ్లు యంగ్ గా కనిపించాడు. మిగిలిన యాక్టింగంతా తన స్టైల్లోనే సాగింది. 

ఆల్లరి నరేష్ పాత్రలో డెప్త్ ఉంది. రాజ్ తరుణ్ మాత్రం అసలెందుకున్నాడో అర్థం కాదు. అసలా పాత్ర పర్పస్ కూడా బలంగా లేదు. 

ఆషికా రంగనాథ్ చూడడానికి బాగుంది. ఆమెకి తగినంత స్క్రీన్ స్పేస్ ఉంది కానీ రుక్షర్ కి అసలు లేదు. మిర్ణా మీనన్ కి ఒకటి రెండు సన్నివేశాల్లో కాస్త నటించే అవకాశం దక్కింది. 

రావురమేష్ ఓకే. నాజర్ పాత్ర చివర్లో కన్సిస్టెన్సీ తప్పినట్టయ్యి, సడన్ గా గిల్ట్ ఫీలైన ఎక్స్ప్రెషన్ తో ముగుస్తుంది. 

ఈ చిత్రంలో ప్రధానమైన సమస్యలు- ఎమోషన్ పండకపోవడం, రాసుకున్న డైలాగులు ఒక్కటీ పేలకపోవడం, కాలం చెల్లిన కథనం, దర్శకుడు వినోదాత్మకంగానే తీసాననుకున్నా ఆ వినోదాన్ని ఆడియన్స్ ఫీలవ్వకపోవడం. వీటికి తోడు అవసరం లేని హై డోస్ ఫైట్లు, నరుక్కోవడాలు టార్గెట్ ఆడియన్స్ కి శిరోభారమౌతాయి. 

ప్రధమార్ధం ఉన్నంతలో కాస్త సరదాగానే సాగినా, ద్వితీయార్ధానికి వచ్చే సరికి మరీ హెవీ అయిపోయింది. 

చిత్రం నిడివి 2 గంటల 26 నిమిషాలే అయినా మూడు గంటల భారాన్ని మోసిన అనుభూతి కలుగుతుంది. మళయాళ మాతృకలో 1960 ల-1980 ల నేపథ్యముందని తెలుగులో కూడా ఆ టైం లైన్ లో తీసారు తప్ప అసలీ పీరియడ్ బ్యాక్ డ్రాపుకి పర్పస్ ఏంటో కూడా తెలీదు. పైగా ఆ కాలం నాటి కథ అని గుర్తు చేయడానికి పాత నాగేశ్వరరావు పాటలు పదే పదే వినిపించడం కూడా ఓవర్ డోస్ అయ్యింది. కథలో ఎమోషన్ ఉండాలి కానీ ఏ పీరియడ్ బ్యాక్ డ్రాప్ అయితే ఏముంటుంది తేడా?

తెరపై యాంబియన్స్ బాగానే ఉన్నా ఆడియన్స్ కి కథనంలో ఫ్రాగ్రన్స్ అందదు. పండగకి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చూద్దామనుకునే ఫ్యామిలీ ప్రేక్షకులకి ఇది పైసావసూల్ అనిపించదు. 

బాటం లైన్: అదో రకంగా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?