జనసేనాని పవన్‌కల్యాణ్‌కు నిశ్చితమైన అభిప్రాయాలుండవు. గంటకోసారి అభిప్రాయాల్ని మార్చుకోగల సమర్థుడు ఆయన. తన పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం, అలాగే మతాలను కలిపే రాజకీయం ఉన్నాయి. పవన్‌కల్యాణ్ మాటలు చాలా గొప్పగా వుంటాయి. చేతలే… అందుకు పూర్తి విరుద్ధంగా వుంటాయి. అందుకే పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించినా, ఇంత వరకూ ప్రజాదరణకు నోచుకోలేదు.
ఇప్పుడు కులాల వెంట పడుతున్నారాయన. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్, తన వెంట ఇతర కులాలు రావని గ్రహించారు. ఈ నేపథ్యంలో కనీసం సొంత కులానికి కట్టుబడి వుంటే, వారైనా తన వెంట నమ్మకంగా నడుస్తారనే నిర్ణయానికి వచ్చారు.
ఒకప్పుడు తనను కాపు అని చెప్పుకోడానికి ఇష్టపడని పవన్, ఇప్పుడు అదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. ఇందుకు ఆయన సిగ్గుపడకపోగా, గర్విస్తున్నానని బహిరంగంగా ప్రకటిస్తుండడం గమనార్హం.
ఇటీవల కాలంలో కాపు నాయకులు జనసేనలోకి క్యూ కట్టడాన్ని గమనించొచ్చు. తనది కాపు కులపార్టీగా ముద్రపడడానికే పవన్ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బందరు వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈయనది కాపు సామాజిక వర్గం.
ఇక కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సైతం జనసేనలో చేరడానికి నిర్ణయించుకోవడం విశేషం. నిన్నమొన్నటి వరకూ పవన్‌ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ముద్రగడ బహిరంగ లేఖలు రాశారు. ముద్రగడ, పవన్ మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందో తెలియదు కానీ, జనసేనలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దర్నీ కలిపేది కులం తప్ప, మరే అంశం కనిపించడం లేదు.
ఈ నెల 23వ తేదీలోపు పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను పార్టీలో చేర్చుకోనున్నారు. ముద్రగడ చేరికతో జనసేన కుల పార్టీ అని అధికారికంగా రాజముద్ర పడనుంది. ముద్రగడను చేర్చుకోవడం వల్ల జనసేనలో కాపుల సంఖ్య పెరగొచ్చు. ఇదే సందర్భంలో జనసేనతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి మిగిలిన కులాలు దూరం అవుతాయనే చర్చ కూడా లేకపోలేదు.
రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడనే సిద్ధాంతం వుంది. కాపులకు శెట్టిబలిజలకు మధ్య వైరం ఇప్పటిది కాదు. అలాగే కాపులతో బీసీలు, దళితులకు గ్యాప్ వుందనే చర్చను విస్మరించలేం. కాపులు బలపడితే, టీడీపీకి చిక్కులే. ఎందుకంటే నాలుగైదు శాతం కమ్మ సామాజిక వర్గం బలమున్న టీడీపీకి అధికారంలో వాటా దక్కితే, దాదాపు 15 శాతం కుల బలం ఉన్న తమ సంగతేంటని ఇప్పటి నుంచే కాపు ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
అధికారం అనేది అత్యంత ప్రమాదకారి. అది ఏమైనా చేస్తుంది, చేయిస్తుంది. ఇందుకు చంద్రబాబే పెద్ద ఉదాహరణ.