ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నుంచి వరుసగా రెండో సారి గెలిచారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆయన కుమారుడు పి.నరేన్ రామాంజనేయరెడ్డి ఈ దఫా కమలాపురం నుంచి పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. తండ్రి వారసత్వంగా ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత నెలలో క్రిస్మస్ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయకు వచ్చినప్పుడు తండ్రితో పాటు నరేన్ కూడా కలిశారు. సీఎం జగన్‌తో నరేన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. “బావా …రానున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తా. టికెట్ నాకివ్వు” అని సీఎంను అడిగినట్టు తెలిసింది.
“నువ్వు, మీ నాన్న మాట్లాడుకుని రండి. పోటీ ఎవరు చేస్తారో తేల్చుకోండి” అని నరేన్‌కు జగన్ సూచించారని సమాచారం. మరోవైపు బరి నుంచి తప్పుకోడానికి రవీంద్రనాథ్‌రెడ్డి ససేమిరా అంటున్నారు. తండ్రి వైఖరిపై నరేన్ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి వారసులు బరిలో దిగడాన్ని నరేన్ తన సన్నిహితుల వద్ద ఉదహరిస్తున్నారు. ఆ నాలుగు నియోజక వర్గాల ఎమ్మెల్యేల మాదిరిగా తనను కూడా ఇప్పుడే ఎందుకు పోటీ చేయించడం లేదో అర్థం కావడం లేదని నరేన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అవకాశం ఉన్నప్పుడే రాజకీయ ప్రవేశం కల్పిస్తే, ఆ తర్వాత లోటుపాట్లు సవరించుకుని నిలదొక్కుకుంటానని నరేన్ అంటున్నారు. అయితే రవీంద్రనాథ్‌రెడ్డి వాదన మరోలా వుంది. రెండు దఫాలే కదా తాను ఎమ్మెల్యేగా పని చేసింది, అప్పుడే రాజకీయాల నుంచి విరమించేంతంగా తన వయసు మీరిపోయిందా? అని ప్రశ్నిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో తండ్రీకొడుకులు కమలాపురం టికెట్ విషయంలో కిందామీదా పడుతున్నారు. నరేన్ మాత్రం సన్నిహితుల వద్ద తండ్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం రవీంద్రనాథ్‌రెడ్డికి తెలుసో, లేదో!