ఇక అనుమతులన్నీ వృధాయేనా..!

గుంటూరుకారం సినిమాకు ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ నుంచి ఈ సినిమా కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా జీవోలు విడుదల చేశాయి. టికెట్ రేట్ల పెంపుతో పాటు, అదనపు ఆటల సౌకర్యాన్ని…

గుంటూరుకారం సినిమాకు ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ నుంచి ఈ సినిమా కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా జీవోలు విడుదల చేశాయి. టికెట్ రేట్ల పెంపుతో పాటు, అదనపు ఆటల సౌకర్యాన్ని కల్పించాయి. ఇప్పుడా ప్రత్యేక అనుమతులేవీ పనిచేసేలా కనిపించడం లేదు.

ముందుగా తెలంగాణ విషయానికొద్దాం.. గుంటూరుకారం సినిమాకు 18వ తేదీ వరకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఈ వారం రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు.. రోజుకు 6 షోలకు కూడా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

అయితే గుంటూరుకారం ఫలితం ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. దీంతో హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో ఉదయం 4 గంటల షోలు రద్దయ్యాయి. అతి తక్కువ స్క్రీన్స్ లో మాత్రమే ఉదయం 7.30, 8.40 షోలు షెడ్యూల్ చేశారు.

90శాతానికి పైగా స్క్రీన్లు ఎప్పట్లానే రోజుకు 4 ఆటలకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ ఆన్ లైన్ బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. పండగతో సంబంధం లేకుండా వీకెండ్ ఆక్యుపెన్సీ బాగుంటుంది. కానీ గుంటూరుకారం సినిమాకు ఆదివారం బుకింగ్స్ కూడా ఆశాజనకంగా కనిపించడం లేవు. దీంతో ప్రత్యేక అనుమతితో సంబంధం లేకుండా రేపోమాపో టికెట్ రేట్లు తగ్గించే యోచనలో ఉంది యూనిట్.

ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, ఈ సినిమాకు ఏపీలో 10 రోజుల పాటు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. టికెట్ రేట్లపై పెంపు ప్రకటించారు. చాలా ప్రాంతాల్లో 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం వరకు చూసి, మంగళవారం నుంచి టికెట్ రేట్లపై పునఃసమీక్షించుకోవాలని అంతా ఓ మాట అనుకున్నారు.

ఇలా కష్టపడి తెచ్చుకున్న అనుమతులు గుంటూరుకారం సినిమాకు పెద్దగా కలిసిరాలేదు. ఉన్నంతలో నైజాంలో బెనిఫిట్ షోలు, ఆ తర్వాత వేసిన ఎర్లీ మార్నింగ్ షో కలిసొచ్చాయంతే.