వైసీపీ మునిగిపోతున్న నావ కాబట్టి ఆ పార్టీలో నుంచి నాయకులు అంతా బయటకు పోతున్నారని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేస్తున్నారు. అదే నిజం అనుకుంటే టీడీపీ నుంచి కేశినేని నాని లాంటి వారు వైసీపీలోకి వెళ్లారు, అలాగే రాయపాటి రంగారావు చంద్రబాబు ఫోటోని విసిరికొట్టి పార్టీకి రాజీనామా చేశారు.
ఇంకా టీడీపీ టికెట్లను అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. టీడీపీ టికెట్ల చిట్టా వెలుగు చూస్తే ఎంతమంది ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తారో గంటా చెప్పగలరా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పార్టీ నుంచి బయటకు పోవడమే గెలుపోటములకు కొలమానం అనుకుంటే అలా నేతలు వెళ్ళిపోయినా గెలిచిన పార్టీలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
టికెట్లు ఇవ్వలేదని అలిగి బయటకు వెళ్ళే వారు ఆయన పార్టీల ప్రజాభిమానానికి కొలమానం ఎలా అవుతారో గంటాయే చెప్పాలని అంటున్నారు. గంటా కూడా అనేక పార్టీలు మారి వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆయన 2019 తరువాత నాలుగేళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నారో ఇపుడు ఎందుకు ఆయన జోరు చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు అంటున్నారు.
తెలుగుదేశానికి అంత గెలుపు ధీమా ఉంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయడంలేదని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనతో కలసి వస్తున్నారు అంటేనే వైసీపీ బలం అయినది అని అంగీకరిస్తున్నారు కదా అని కౌంటర్లేస్తున్నారు. వైసీపీ విశాఖలో ఒక్క సీటూ గెలవదు అని జోస్యం చెబుతున్న గంటా తాను ఎక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో చెప్పాలని సెటైర్లు వేస్తున్నారు.