విజయనగరం ఎమ్మెల్యే సీటు విషయంలో టీడీపీలో సందిగ్దం కొనసాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని 2024 ఎన్నికల్లో పోటీ చేయమని టీడీపీ అధినాయకత్వం కోరుతోంది. ఆయనకే టికెట్ కన్ ఫర్మ్ అని కూడా ప్రచారంలో ఉంది.
అయితే అశోక్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఏడు పదులు దాటేశారు. తాను చూడని పదవులు లేవని, ఇప్పటికే అనేక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చానని చెబుతున్నారని అంటారు.
ఆయన ఆశ అంతా కుమార్తె అతిది గజపతిరాజు మీదనే. ఆమెను తన రాజకీయ వారసురాలిగా అశోక్ ముందుంచుతున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. 2019లో అశోక్ కి ఎంపీగా అతిది గజపతిరాజుకు ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్లు ఇచ్చింది.
ఈసారి మాత్రం కేవలం అశోక్ కే టికెట్ ఇస్తున్నారు. అయితే తనకు కాకపోయినా కుమార్తెకు అయినా ఇస్తే చాలు అంటున్నారు. చివరికి ఇపుడు ఆయన తన సీటు అయిన విజయనగరాన్ని త్యాగం చేసి కుమార్తెకి ఇవ్వాలని చూస్తున్నారుట.
విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్న అతిది గజపతి రాజు ప్రస్తుతం నియోజకవర్గం అంతటా తానే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారం ఆమె మొదలెట్టేశారు. దీన్ని చూస్తున్న వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఆమె అనే అంటున్నారు. దీనికి టీడీపీ అధినాయకత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలని అంటున్నారు.