అన్నా చెల్లెళ్ళకు వైసీపీ బంపర్ ఆఫర్…!

వైసీపీ అన్నా చెల్లెళ్లు ఇద్దరికీ బంపర్ ఆఫర్ ఇచ్చేస్తోంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇప్పటికే ఖరారు చేసిన వైసీపీ అధినాయకత్వం లేటెస్ట్…

వైసీపీ అన్నా చెల్లెళ్లు ఇద్దరికీ బంపర్ ఆఫర్ ఇచ్చేస్తోంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇప్పటికే ఖరారు చేసిన వైసీపీ అధినాయకత్వం లేటెస్ట్ గా అనకాపల్లి ఎంపీ సీట్లు ఆయన చెల్లెలు, ఎలమంచిలి మునిసిపల్ చైర్ పర్సన్ అయిన ఆడారి రమాకుమారికి ఖాయం చేస్తోంది.

ఆడారి రమాకుమారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా పనిచేశారు. వీరిద్దరి తండ్రి అయిన ఆడారి తులసీదాస్ కి ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. ఆయన ఈ మధ్యనే దివంగతులయ్యారు. ఆయన రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా అన్ని పార్టీలకు ఆయన అండదండలు ఉండేవి.

ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ 2019లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. తదనంతరం పరిణామాల క్రమంలో ఆయన వైసీపీలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని ఈసారి వైసీపీ పరం చేసేందుకు ఆనంద్ పట్టుదలగా కృషి చేస్తున్నారు.

అనకాపల్లి ఎంపీ విషయానికి వస్తే రమాకుమారికి రూరల్ జిల్లాలో బలం ఉంది. దాంతో పాటు బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో వైసీపీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ని మలసాల భరత్ కుమార్ కి ఖరారు చేసింది. ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో గవరలు, కాపులు అధిక సంఖ్యలో ఉంటారు. దాంతో అన్ని రకాలుగా సామాజిక వర్గ సమీకరణలను సరిచూసుకుని మరీ వైసీపీ టికెట్లను కేటాయిస్తోంది.