జగన్ కి ఉత్తరాంధ్రా సెంటిమెంట్!

ముఖ్యమంత్రి ఈసారి తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా సెంటిమెంట్ గా పెట్టుకుంటున్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి విశాఖ జిల్లా భీమునిపట్నం వస్తున్నారు. అయిదు జిల్లాల రీజనల్ స్థాయి వైసీపీ…

ముఖ్యమంత్రి ఈసారి తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా సెంటిమెంట్ గా పెట్టుకుంటున్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి విశాఖ జిల్లా భీమునిపట్నం వస్తున్నారు. అయిదు జిల్లాల రీజనల్ స్థాయి వైసీపీ మీటింగ్ ని అక్కడ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో చూసుకున్నా ఈసారి ఉత్తరాంధ్రా అత్యంత కీలకం కానుంది. వైసీపీ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో బలంగా ఉంది. గోదావరి జిల్లా రాజకీయంలో టీడీపీ జనసేన కూటమి అధిపత్యం చలాయించాలని చూస్తోంది. క్రిష్ణా గుంటూరు హోరా హోరీ పోరు సాగనున్నాయి. దీంతో ఉత్తరాంధ్రా జిల్లాలే ఏపీలో అధికారానికి రాచబాట వేయనున్నాయని అంటున్నారు.

మొత్తం ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీదే ముఖ్యమంత్రి సీటు అన్నది రాజకీయంగా ఉన్న విశ్లేషణ. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు జగన్ అందరి కంటే ముందే అలెర్ట్ అవుతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపీ హవా మరోసారి చాటి చెప్పడానికి వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభించనుంది.

బీసీలు ఎక్కువగా ఇక్కడ ఉండడంతో పాటు వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ మరోసారి కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్రాలో ఈసారి కూడా అత్యధిక శాతం సీట్లను బీసీలకే ఇస్తోంది. నాలుగు ఎంపీ సీట్లూ బీసీలకు ఇవ్వడం ఒక రికార్డుగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో మరోసారి వైసీపీ గెలిచేందుకు ఎంతో దోహదపడుతుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.

విశాఖను పాలానా రాజధానిగా ప్రకటించినా విపక్ష తెలుగుదేశం దానికి మోకాలడ్డడం మీద కూడా వైసీపీ ఉత్తరాంధ్రాలోనే తేల్చుకోవాలని చూసోంది. టీడీపీ ఉత్తరాంధ్రాకు ఏమీ చేయలేదని అంకెల సాక్షిగా కూడా రుజువు చేయబోతోంది. ఉత్తరాంధ్రా నుంచే వైసీపీ వ్యూహాలను పదును పెడుతోంది.