జనసేన, టీడీపీ పరస్పరం ఇష్టంతో పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుపై జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ప్రేమ కంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విద్వేషమే ఎక్కువ. బాబును గద్దె ఎక్కించడం కంటే, జగన్‌ను అధికారం నుంచి దింపేయడం పవన్ ప్రధాన ఆశయం. అయితే పవన్‌కల్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా, కాపుల అభిప్రాయం లేదు. ఇటీవల ఏపీలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటు అధికారంలో ఉన్న వైసీపీలో, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలు ఆయా పార్టీల నుంచి బయటికి వెళ్లిపోతున్నారు. వైసీపీలో కనీసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన తర్వాత, టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. టీడీపీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక చేపట్టకనే ముఖ్యంగా బాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు బయటికెళ్లడం గమనార్హం. ఈ పరిణామం టీడీపీకి ఆందోళన కలిగించేదే.
ఇక జనసేన విషయానికి వస్తే, ఆ పార్టీకి శుభ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. జనసేన అంటే కాపుల పార్టీ అనే ప్రచారం వుంది. ఇంతకాలం పవన్‌కల్యాణ్‌తో రాజకీయంగా విభేదించే ఆయన సామాజిక వర్గం నేతలు జనసేనలో చేరాలని అనుకోవడం విశేషం. దీంతో కాపుల్లో జోష్ కనిపిస్తోంది. ఆ ఉత్సాహం ఎంత వరకు వెళ్లిందంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో భాగం కావాల్సిందే అని డిమాండ్ బలపడుతోంది.
తాజాగా కాపు కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సోషల్ మీడియా వేదిక ఒక లేఖ విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ ఆహ్వానం మేరకు మంగళగిరి వెళ్లి జనసేన అధ్యక్షుడిని కలిసినట్టు తెలిపారు. ఈ లేఖలో కొన్ని అంశాల్ని ఆయన ప్రస్తావించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిదో పవన్‌కల్యాణ్‌కు చెప్పినట్టు హరిరామ జోగయ్య తెలిపారు. అన్నింటికంటే ప్రధానమైంది అధికారంలో భాగస్వామ్యం గురించి పవన్‌కు చెప్పడం గురించి.
టీడీపీతో పొత్తులో భాగంగా అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడు, రెండున్నర సంవత్సరాల పాటు పవన్ సీఎం అయితేనే ఓట్ల బదిలీ జరుగుతుందనే కీలక అంశాన్ని బలంగా చెప్పినట్టు చేగొండి వెల్లడించారు. ఒకవేళ పవన్‌కు సీఎం పదవి దక్కదనే సంకేతాలు వెళితే, 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయనే చేగొండి హరిరామజోగయ్య హెచ్చరికను కొట్టి పారేయలేం.
పవన్‌తో భేటీ సందర్భంగా మొదట, ఆఖరులో రెండున్నరేళ్ల సీఎం పదవి గురించే అని, దాన్ని తీర్చే బాధ్యత చంద్రబాబుతో పాటు మీపై కూడా వుందని తమ కుల నాయకుడికి చెప్పినట్టు హరిరామ జోగయ్య తెలిపారు. ఒకవైపు టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడే పూర్తి కాలం సీఎం అని లోకేశ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కనీసం డిప్యూటీ సీఎం పదవైనా పవన్‌కు ఇస్తామనే హామీ లోకేశ్ నుంచి రాలేదు.
మెజార్టీ కాపులు జనసేన బాట పడుతున్నారంటే… ఉత్తుత్తి పుణ్యానికే అనుకుంటే పొరపాటే. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌ను కనీసం రెండున్నరేళ్ల పాటు సీఎం చేసుకోవచ్చని ఆయన పార్టీలోకి వెళుతున్న కాపు నాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య ప్రతిపాదిస్తున్న రెండున్నరేళ్ల అధికారం …కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాదు. పవన్, హరిరామజోగయ్యలకు ముద్రగడ పద్మనాభం తోడైతే, ఉమ్మడి మ్యానిఫెస్టోలో జనసేనానికి రెండున్నరేళ్ల సీఎం పదవి చేర్చాలనే ప్రతిపాదన తప్పక బలపడుతుంది. అది లేకపోతే పొత్తుపై నీలి నీడలు అలుముకునే అవకాశం వుంది.
ఎందుకంటే రెండున్నరేళ్ల సీఎం పదవిని ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పటికీ సాధ్యం కాదనేది కాపు పెద్దల అభిప్రాయం. అందుకే ఆ డిమాండ్ టీడీపీ పాలిట నివురుగప్పిన నిప్పు అని హెచ్చరించక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరి ప్రయోజనాలే అంటే కుదరదు. అందులోనూ కాపులతో వ్యవహారం మామూలుగా వుండదు. సీఎం పదవిపై లోకేశ్ కుదరదని తేల్చి చెప్పినా, కాపులు లోలోపల మదనపడుతున్నారే తప్ప పెద్దగా బయటపడడం లేదు.
రేపు అధికారంలోకి వస్తే, అప్పుడు చూసుకుందాం అనే భావన వారిలో గట్టిగా వుంది. అధికారం కోసం ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే విడిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటిది చంద్రబాబు, పవన్ అంతా మంచిగా వుంటుందని ఎలా అనుకుంటారు? అధికారం కోసం కాపులు కాచుక్కూచున్నారు. దాన్ని చంద్రబాబు మాత్రమే అనుభవిస్తారని టీడీపీ శ్రేణులు అనుకుంటే, జనసేన కార్యకర్తలు, నాయకులు అమాయకులు కాదు. నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అనే సామెత ఉండనే ఉంది.