బెనిఫిట్ షోల నుంచే నెగెటివ్ టాక్ వచ్చిందంట!

రివ్యూలు బాగా లేకపోయిన సినిమాలు థియేటర్లలో బాగా ఆడిన సందర్భాలున్నాయి. రివ్యూలు బాగా ఇచ్చిన సినిమాలు థియేటర్లలో వెలవెలబోయిన దాఖలాలూ ఉన్నాయి. ఇవన్నీ సమీక్షకుల దృక్కోణానికి, ప్రేక్షకుల తీర్పుకు మధ్య నడిచే వ్యవహారం. Advertisement…

రివ్యూలు బాగా లేకపోయిన సినిమాలు థియేటర్లలో బాగా ఆడిన సందర్భాలున్నాయి. రివ్యూలు బాగా ఇచ్చిన సినిమాలు థియేటర్లలో వెలవెలబోయిన దాఖలాలూ ఉన్నాయి. ఇవన్నీ సమీక్షకుల దృక్కోణానికి, ప్రేక్షకుల తీర్పుకు మధ్య నడిచే వ్యవహారం.

ఫ్యాన్స్ దీనికి పూర్తిగా అతీతం. తమ హీరో సినిమా ఎలా ఉన్నా వీళ్లు మోస్తారు. బయటకొచ్చి మైకుల ముందు సూపర్, కేక అంటూ హంగామా చేస్తారు. అర్థరాత్రి బెనిఫిట్ షో చూసే జనంలో కనీసం 50 శాతం వీళ్లే ఉంటారు.

అందుకే బెనిఫిట్ షోల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తే చాలామంది అనుమానిస్తారు. ఎందుకంటే, అది ఫ్యాన్స్ టాక్, సాధారణ ప్రేక్షకుల ఫీలింగ్ కాదు. 2-3 షోలు నడిచిన తర్వాత అసలు మేటర్ ఏంటనేది మెల్లమెల్లగా బయటకొస్తుంది.

అయితే గుంటూరుకారం సినిమాకు మాత్రం అర్థరాత్రి నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చిందంటున్నారు నిర్మాత నాగవంశీ. మహేష్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందనే విషయాన్ని అంగీకరిస్తూనే.. ఈవెనింగ్ షోలు ముగిసేనాటికి నెగెటివ్ టాక్ కాస్తా పాజిటివ్ గా మారిపోయిందని కూడా చెబుతున్నారు.

ఈ సందర్భంగా ప్రేక్షకులకు తననుంచి ఓ విజ్ఞప్తి కూడా చేశారు. టాక్ తో సంబంధం లేకుండా థియేటర్లలోకి వచ్చి గుంటూరుకారం సినిమా చూడాలంట. బయట వినిపించేవీ ఏవీ నమ్మకుండా, సినిమా చూడాలని, అందరూ ఎంటర్ టైన్ అవుతారని, తనది గ్యారెంటీ అని కూడా చెబుతున్నారు. ఆయనలా చెబుతుంటే, పక్కనే ఉన్న దిల్ రాజు, ముసిముసిగా నవ్వుతూ కనిపించారు. ఆయన ఎందుకలా నవ్వారో తెలియదు. 

మరోవైపు గుంటూరుకారం సినిమా నుంచి మొదటి రోజు వసూళ్లపై పోస్టర్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 94 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని, మొదటి రోజు వసూళ్లలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకున్నారు. ఆ పక్కనే బ్రాకెట్లో 'ఫర్ ఏ రీజనల్ ఫిలిం' అని కూడా రాసుకున్నారు. అదీ సంగతి.