త్రివిక్రమ్.. గ్రంధాలయం ఖాళీ? లేక..?

ఏదో వుంది.. ఏదో జరిగింది. మాటల మాంత్రికుడు, గురూజీ అని టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న, పాతిక, ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటారని పేరు పడిన దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో ఏదో జరిగింది. Advertisement సినిమాలు…

ఏదో వుంది.. ఏదో జరిగింది. మాటల మాంత్రికుడు, గురూజీ అని టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న, పాతిక, ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటారని పేరు పడిన దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో ఏదో జరిగింది.

సినిమాలు సెట్ చేయడం, ఇతరత్రా ఆదాయ మార్గాలు అన్వేషించడంలో పడి తన క్రాఫ్ట్ ను వదిలేసారా? లేక తన దగ్గర వున్న లైబ్రరి ఖర్చు అయిపోయిందా? లేక ఇంకేదైనా కారణం వుందా? ముందు నుంచి వివిధ విషయాల్లో హీరో మహేష్ తో పొసొగడం లేదంటూ వినవచ్చిన గ్యాసిప్ ల ఫలితమే ఈ ఫెయిల్డ్ ప్రొడెక్ట్ నా? మొత్తానికి ఏదో జరిగింది.

లేదూ అంటే అజ్ఙాతవాసిని మరిపించే లాంటి గుంటూరు కారం లాంటి వాసి లేని సినిమాను త్రివిక్రమ్ నుంచి వస్తుందా?

అసలు కథ లేదు.. వున్న కథలో కొత్తదనం లేదు. హీరో తప్ప ఏ ఒక్క పాత్రకు పట్టుమని పది డైలాగులు లేవు. కీలకపాత్ర రమ్యకృష్ణ కే డైలాగులు లేవు. ప్రకాష్ రాజ్ కు దగ్గడమే డైలాగు అయిపోయింది. హీరోయిను శ్రీలీలకు రాము.. అంటూ హోయలు పోవడంతో సరిపోయింది. మిగిలిన పాత్రలు అన్నీ కలిపేసినా పట్టుమని రెండు మూడు పేజీల డైలాగులు లేవు.

అంటే టోటల్ స్క్రిప్ట్ కు డైలాగు రైటర్ గా త్రివిక్రమ్ చేసిన వర్క్ ఎంత అని అనుకోవాలి.

సినిమా కథ కే కాదు సన్నివేశాలకు కూడా రిఫరెన్స్ లు వున్నట్లు కనిపిస్తుంది. హీరో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంటే హీరోయిన్ కనపడడం అన్నది త్రివిక్రమ్ సినిమాకు కామన్ అయిపోయింది. అరవింద సమేత లో లాయర్.. ఆయన కూతురు హీరోయిన్. ఇక్కడ డిటో.. డిటో.. అ ఆ లో మాదిరిగా ఓ అసిస్టెంట్ ను తీసుకుని హీరోయిన్ వేరే ఊరికి రావడం. తలుపు గడియ రావడం లేదు.. ఇది రావడం లేదు అంటూ హోయలు పోవడం. ఖలేజాలో అనుష్క ను ఫ్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అని వెటకారం చేస్తే, ఇక్కడ… వేసుకని చింపేసుకుంటారా? చింపేసుకుని వేసుకుంటారా? అంటూ వెటకారం.

‘వెళ్లిపోకే శ్యామలా..’ అంటూ గతంలో పాట అందించినట్లే, ఈసారి ‘మామా ఎంతయినా పర్లేదు బిల్లు’ అంటూ పాడడం, గమ్మత్తేమిటంటే ఇంట్లో తాగుతూ బిల్లు గురించి ప్రస్తావన ఎందుకో? ఇక క్లయిమాక్స్ కు రిఫరెన్స్ అత్తారింటికి దారేది అని కొత్తగా చెప్పనక్కరలేదు. జగపతి బాబుకు హీరో కుటుంబంతో ఏం చుట్టరికమో, ఏం పగో అస్సలు అర్ధం కాదు.

లారెన్స్ సినిమాల్లో ఆడవాళ్ల ఫైట్ తో మాస్ ను అలరించడాన్ని కూడా గురూజీ అందిపుచ్చుకున్నారంటే ఏం అనాలి? మహేష్ లాంటి సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ లాంటి ఏస్ డైరక్టర్ ఏమన్నా చేస్తే అది ట్రెండ్ అవ్వాలి. వైరల్ అవ్వాలి. అంతే కానీ యూ ట్యూబ్ లో వైరల్ కంటెంట్ తెచ్చుకుని వాడేసుకోవడం కాదు. భోగం మేళాను తీసుకువచ్చి, హీరోయిన్ కు సగానికి మీదకు చీరకట్టి, భంగిమలతో డ్యాన్స్ లు చేయించి, సినిమాను ఆడించేసుకోవాలి అనే త్రివిక్రమ్ తహ తహ చూస్తుంటే…ఈయన మనం అభిమానించే గురూజీయేనా అని తలచుకుని కాస్త బాధేస్తుంది.

ఇక కథకుడిగా కూడా త్రివిక్రమ్ అట్టర్ ఫెయిల్యూర్. కథ రెండు ఇళ్ల మధ్య తప్ప మరో గడప తొక్కదు. అమ్మ.. నాన్న.. బాబాయ్.. అత్త.. మామయ్య ఇంతే. పోనీ అవే ఆయన ట్రేడ్ మార్క్ అనుకుంటే కథలో కీలకపాయింట్ కూడా మారదు. సన్నాఫ్ సత్యమూర్తిలో ఓ డాక్యుమెంట్ కోసం వేరే ఇంటికి వెళ్తే, అల వైకుంఠపురములో వ్యాపారం అమ్మే డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమని విలన్ సముద్రఖని ఒత్తిడి. అత్తారింటికి దారేదిలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల మీటింగ్ ఒక ఓటు తక్కువైందని అత్తను తీసుకురావడం పాయింట్.. గుంటూరుకారంలో తమ‌తో సంబంధం లేదని సంతకం చేయాలనే డాక్యుమెంట్ పాయింట్.

అంటే కథకుడిగా త్రివిక్రమ్ కొత్తగా ఆలోచించలేకపోతున్నారా? ఆలోచించాలి అని అనుకోవడం లేదా? చమక్కులతో, హీరో చరిష్మాతో నెట్టుకువచ్చేయచ్చు అనుకుంటున్నారా? అల వైకుంఠపురములో సినిమాకు బన్నీ హీరో కాకపోయి వుంటే, ఆ పాటలు లేకుంటే పరిస్థితి ఏమిటి? గుంటూరు కారంలో కూడా అదే పాటలు మ్యాజిక్ చేస్తాయనుకున్నారు కుదరలేదు.

ఏనాడో పాత సినిమాల్లో వుండేది. హీరో ఒక్కసారిగా విలన్ మీద తిరగబడితే..’నీ పాపం పండెను నేను.. నీ భరతం పడతా చూడు’ అనే టైపు పాటలు. అజ్ఙాతవాసిలో అలాగే వాడదాం అని చూసి దారుణమైన ఫెయిల్యూర్ ను ఖాతాలో వేసుకున్నారు. గుంటూరుకారంలో కూడా ఏనాటిదో కృష్ణ పాత పాట వాడి మరోసారి ఫెయిల్ అయ్యారు. రిఫరెన్స్.. రిఫరెన్స్.. రిఫరెన్స్.. ఇలా సినిమా ప్రతి దానికీ రిఫరెన్స్. మరి గురూజీ కొత్త క్రియేటివిటీ ఎక్కడికి వెళ్లిపోయినట్లు?

కీర్తి కిరీటాలు నవలలో కథానాయిక భర్తతో విడాకులు, కొడుకును అతని దగ్గరే వదిలేసి రావడం, మళ్లీ పెళ్లి మరో కొడుకు, ఈ మేరకు ఉంటే చాలదా.. అల్లేద్దాం ఏదో ఒకటి అనుకోవడానికి. భీమవరం స్ధానిక గ్రంధాలయం ఇచ్చిన, నేర్పినది అంతా అయిపోయిందా?

ఇక్కడ ఒక కామన్ పాయింట్ గమనించాలి. క్రియేటివ్ పీపుల్ ఎప్పుడూ బిజినెస్ ల్లోకి వెళ్ల కూడదు. వివి వినాయక్ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి, సినిమాలు పాడు చేసుకున్నారని ఇండస్ట్రీలో ఒక టాక్ వుంది. కొరటాల శివ సినిమా వ్యాపారం మీద దృష్టి పెట్టి, బ్యాడ్ అయ్యారని టాక్ వుంది. త్రివిక్రమ్ నేరుగా పవన్ కోసం సినిమాలు సెట్ చేస్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి ఆయన సెట్ చేసినవే. దీనికి ఫలితంగా ఆయన ఏం తీసుకుంటున్నారు.. ఎంత తీసుకుంటున్నారు అన్నది మనకి అనవసరం. కానీ అవి ఆయన క్రియేటివ్ టైమ్ ను తినేస్తున్నాయి.

అలాగే భార్య పేరుతో బ్యానర్ పెట్టారు. సినిమాల్లో భాగస్వామి అయ్యారు. అక్కడితో సరిపోతుందా? ఆ సినిమాల కథలు వినాలి. క్వాలిటీ చెక్ చేయాలి. అవి కూడా టైమ్ తినేస్తాయి. మరి తన స్వంత వర్క్ కు టైమ్ ఎంత చిక్కుతుంది. సుకుమార్, కొరటాల మాదిరిగా టీమ్ వర్క్ కాదు త్రివిక్రమ్ ది. సోలో టీమ్. ఎంత సమయం మిగులుతుంది ఆయన సినిమా. ఆదికేశవ లాంటి సినిమా ఆయన భాగస్వామ్యంలో వచ్చింది. అంటే అర్థం అవుతోంది కదా? క్వాలిటీ చెక్ ఆయనకు ఎక్కడ, ఎంత వుందో?

అల వైకుంఠపురములో తరువాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాగే కనిపిస్తోంది. ఏ పెద్ద హీరో ఖాళీగా లేరు. త్రివిక్రమ్ హిట్ ఇచ్చి వుంటే, డేట్ లు ఏదో విధంగా సర్దుబాటు చేసేవారేమో? ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఇక మిగిలింది వెంకటేష్ లాంటి సీరియర్ హీరోలు మాత్రమే.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. దారుణం అయిపోనూ లేదు. త్రివిక్రమ్ మనసు పెడితే మంచి మాటలు రాయగలరు. కావాల్సింది సమయం. మంచి కథ. జబర్దస్త్ లు, వంటల ప్రోగ్రామ్ లు పక్కన పెట్టి, తన ‘స్వధర్మం’ నమ్ముకుంటే త్రివిక్రమ్ మళ్లీ అద్భుతం చేయగలరు.

మనం అభిమానించే వాళ్ల నుంచి ఆశించిన క్వాలిటీ కంటెంట్ రాకుంటే ఆవేదన తప్పదు. ఆ ఆవేదనే తప్ప, గురూజీ మీద ఆక్రోశమూ కాదు.. ఆరోపణ కాదు ఇది.

– విఎఎస్ఎన్ మూర్తి.