గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని తేలిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు. అలాంటి ఓడిపోయే కేండిడేట్లలో కూడా కుల సమీకరణాలు కావొచ్చు, పార్టీతో ఇతరత్రా ఉన్న అనుబంధం వల్ల కావొచ్చు.. కొందరిని ఇతర నియోజకవర్గాలకు షిప్ట్ చేస్తున్నారు. ఎంపీలుగా అవకాశం ఇస్తున్నారు.
అయితే ఇలాంటి వారిలో చాలా వరకు జగన్ నిర్ణయాల పట్ల ఏకీభావమే వ్యక్తం అవుతోంది. కానీ.. ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా పంపిస్తోంటే కూడా.. ఆ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించకుండా, డొంకతిరుగుడు మాటలతో పార్టీ మీద ధిక్కారస్వరం వినిపించే వారిని ఏమనాలి? అలాంటి వారిని జగన్ ఇంకా ఎందుకు సహించాలి అనే ప్రశ్న పార్టీ కార్యకర్తల్లో తలెత్తుతోంది.
అనేక అవినీతి ఆరోపణలున్నప్పటికీ, విస్తరణ సమయంలో కూడా తన మంత్రి పదవిని నిలబెట్టుకున్న ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం గెలిచే చాన్సు లేదనడంతో జగన్ అక్కడ ఇన్చార్జిగా మరొకరిని ప్రకటించారు. అయితే అనేక కారణాల వల్ల.. ఆయనను కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేయించేందుకు నిర్ణయించారు. మామూలుగా అయితే.. ఇలాంటి నిర్ణయాన్ని గుమ్మనూరు జయరాం సంతోషంగా స్వీకరించాలి. అయితే ఆయన ఇండైరక్టుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
ఆలూరులోని తన నివాసంలో కార్యకర్తలో సమావేశం పెట్టుకుని.. తన అభిమానుల కార్యకర్తల అభీష్టం మేరకే వెళతానని చిలకపలుకులు పలుకుతున్నారు. నేను ఢిల్లీకి వెళ్లాలా? లేదా, ఇక్కడే ఉండాలా? అనేది మీరే చెప్పాలి! మీరెలా చెబితే అలా చేస్తా అంటున్నారు. ఢిల్లీకి వెళ్లాలని ఆల్రెడీ జగన్ చెప్పిన తర్వాత.. నియోజకవర్గానికి వెళ్లి ఇలా మడత పేచీ పెడుతున్నారు.
గుమ్మనూరు జయరాం స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మంత్రిగా కొనసాగించడమే చాలా ఎక్కువ. ఎమ్మెల్యేగా మళ్లీ గెలవలేడని తెలిశాక ఎంపీ పోస్టు ఆఫర్ చేయడం చాలా ఎక్కువ. అయినా ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా ఇలా మాట్లాడడం పట్ల వైసీపీ అభిమానులు సీరియస్ అవుతున్నారు.
ఇలా ధిక్కార స్వరం వినిపించే వాళ్లని జగన్ అసలు ఎందుకు సహించాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని సహించే కొద్దీ.. అది జగన్ బలహీనతగా ప్రజలకు కనిపిస్తుందని వారు అంటున్నారు.