నిరీక్షణ పర్వంలో ఏపీ కాంగ్రెస్ ఆశలు!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఏపీని విభజించిన తీరువల్ల, ప్రత్యేకహోదా గురించి కూడా హక్కుగా అడిగే పరిస్థితిలేకుండా చేసిన వంచన వల్ల కాంగ్రెసును ఏపీ ప్రజలు…

ఏపీ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఏపీని విభజించిన తీరువల్ల, ప్రత్యేకహోదా గురించి కూడా హక్కుగా అడిగే పరిస్థితిలేకుండా చేసిన వంచన వల్ల కాంగ్రెసును ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారనే సంగతి వారికి కూడా తెలుసు. అయినా వైఎస్ షర్మిల ఆ పార్టీలో అడుగుపెడుతుండేసరికి వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నట్టున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ఎంతమంది అలుగుతారా? అని వారు నిరీక్షిస్తున్నారు.

వైసీపీ మీద అలిగిన వారంతా వేరే గతిలేక తమ పార్టీలోకి వచ్చేస్తారనే ఆశలు వారిలో దోబూచులాడుతున్నాయి. వైఎస్ షర్మిల పేరు చెప్పి.. వైఎస్సార్ అభిమాన ఓటు మనకు పడుతుందని మభ్యపెట్టి కాంగ్రెసులో చేర్చుకోవాలని చూస్తున్నారు.

ఏపీసీసీకి ప్రస్తుతానికి అధ్యక్షుడుగా ఉన్న గిడుగు రుద్రరాజులో పార్టీ భవిష్యత్తు మీద చాలా ఆశలే ఉన్నట్టున్నాయి. సంక్రాంతి తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయని ఆయన అంటున్నారు. అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలతో పాటు, పలువురు మాజీలో కూడా తమతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. అంటే జగన్ పక్కన పెడుతున్నవారంతా.. తెదేపాలో, జనసేనలో ఎంట్రీ దొరక్కపోతే తమ పార్టీలోకి వస్తారనేది ఆయన ఆశగా కనిపిస్తోంది.

తాను, తన భార్యతో కలిసి రెండు నియోజకవర్గాల్లో ఇండిపెండెంటుగానైనా పోటీచేసి తీరుతానని అంటున్న కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు, రఘువీరారెడ్డితో భేటీ కావడం కూడా గిడుగులో ఆశలు పెరగడానికి ఒక కారణం కావొచ్చు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెసు నుంచి ఇంకా ఎవరెవరు బయటకు వస్తారా? వారికందరికీ ఎరవేసి తమలోకి లాక్కుందామా అనే ఆలోచనలో ఆయన గోతికాడ నక్కలాగా వేచిచూస్తున్నట్టుంది.

జగన్ పక్కన పెట్టిన వాళ్లలో చాలామంది పక్కదార్లు చూసుకోవడం అనేది సహజంగా జరిగే పరిణామమే కావొచ్చు గాక. కానీ.. వారందరూ కాంగ్రెస్ ను ఎందుకు ఆశ్రయిస్తారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

కాపు రామచంద్రారెడ్డి లాంటి ఒకరిద్దరి సంగతి వేరు. ఇతరత్రా జగన్ పక్కన పెడుతున్న వాళ్లలో వైఎస్సార్ తో అనుబంధం ఉన్నవాళ్లు కూడా తక్కువే. వైఎస్సార్ జమానాలోనే మంత్రిపదవి వంటి వైభవాన్ని చవిచూసిన కొలుసు పార్థసారథి లాంటి వాళ్లు కూడా జగన్ మీద అలిగాక బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారే తప్ప.. వైఎస్సార్ మీద అభిమానం గానీ, కాంగ్రెస్ మూలాలున్నాయనే భావన గానీ, షర్మిల మీద నమ్మకం గానీ వారిని ఆకర్షించడం లేదు.

కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం లేనప్పుడు ఎవరు మాత్రం రాగలరు? మరి అలాంటప్పుడు మాత్రం.. గిడుగు కోరుకుంటున్నట్టుగా సంక్రాంతి తరువాత.. వెల్లువలా ఎవరైనా రావొచ్చునేమో గానీ.. వారంతా తాలుసరుకే అయిఉంటారు తప్ప.. గట్టిగింజలు ఎందుకొస్తాయి అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.