Advertisement

Advertisement


Home > Movies - Reviews

Saindhav Review: మూవీ రివ్యూ: సైంధవ్

Saindhav Review: మూవీ రివ్యూ: సైంధవ్

చిత్రం: సైంధవ్
రేటింగ్: 2/5
తారాగణం: వెంకటేశ్, శ్రద్ధ శ్రీనాథ్, బేబీ సారా పాలేకర్, ఆర్య, నవాజుద్దిన్ సిద్దికి, రుహాని శర్మ, ఆండ్రియా, ముకేష్ రిషి, జయప్రకాష్, జిషుసేన్ గుప్త తదితరులు
ఎడిటింగ్: గ్యారీ
సంగీతం: సంతోష్ నారాయణన్
కెమెరా: మణికందన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి 
దర్శకత్వం: శైలేష్ కొలను
విడుదల: 13 జనవరి 2024

ఎఫ్2, ఎఫ్ 3 లాంటి వినోదాత్మక చిత్రాలతో నేటి తరం ప్రేక్షకులకి కూడా దగ్గరైన వెంకటేష్ ఈ సారి ఈ యాక్షన్ సినిమాతో ముందుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే చాలా సీరియస్ సినిమా అని అర్ధమవుతూనే ఉంది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

సైంధవ్( వెంకటేశ్) ఒక మాజీ నేరస్థుడు. అతనికొక తల్లిలేని కూతురు గాయత్రి (సారా పాలేకర్).

మనో (శ్రద్ధ శ్రీనాథ్) తన భర్త (గెటప్ శీను) తో గొడవ వల్ల అతని నుంచి దూరంగా బతుకుతూ సైంధవ్ కి స్నేహితురాలిగా,  అతని కూతురికి తల్లిలా ఉంటుంది.

గాయత్రికి స్పైనల్ మజిల్ అట్రోఫీ అనే ఒక అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. అది నయమవ్వాలంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని ఖరీదు 17 కోట్లు.

ఆ డబ్బు కోసం సైంధవ్ ప్రయత్నాలు, ఇంతలో తన మాజీ ముఠా సభ్యుడు (నవాజుద్దీన్) అక్రమంగా ఆయుధాల్ని, డ్రగ్స్ ని, డబ్బుని చంద్రప్రస్థ అనే ప్రాంతానికి తీసుకురావడం, దానిని ఆపే ప్రయత్నంలో కస్టమ్స్ ఆఫీసర్ (జయప్రకాష్) కి సైంధవ్ సహకరించడమనే ట్రాక్ ఒకటి నడుస్తుంది.

పాపకి ఇంజక్షన్ ఇప్పించే ట్రాక్ సెంటిమెంటైతే, నవాజుద్దీన్ తో తలపడడం యాక్షన్ పార్ట్. చివరికి ఏమౌతుందనేది కథనం. 

కథ చూస్తేనే ఎప్పుడో చూసేసిన అరవ డబ్బింగ్ సినిమాల మెడ్లీలాగ అనిపిస్తోంది కదా! ఎక్కడా కొత్తదనం లేని ఈ కథకి మేకింగ్ కూడా అంతే అమెచ్యూరిష్ గా ఉంది. 

పేరున్న నటీనటుల్ని పెట్టేసుకుంటే సరిపోదు. వాళ్లకి నటించడానికి కథలో స్క్రిప్టులో విషయముండాలి. రెండుగంటల ఇరవై నిమిషాల్లో ముగిసినా నాలుగు గంటల సినిమా చూసిన ఫీలింగొస్తే ఆ గొప్పదనం స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ దే. 

డైలాగ్స్ కూడా నీరసంగా సాగుతూ ఎక్కడా స్పార్క్ లేకుండా ఉన్నాయి.

"లెక్క మారుద్ది నా కొడకా" అని వెంకటేష్ చేత రెండు మూడు సందర్భాల్లో అనిపించి అదే అద్భుతమైన మాస్ డైలాగ్ అనుకోమన్నట్టుంది.

1990ల్లో చూసినా కూడా కాస్తంత ఔట్ డేటెడ్ గా ఉందనిపించే స్క్రిప్ట్ ఇది. 

ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు చేస్తూ తన కామెడీ టైమింగుతో ఈ తరం యంగ్ ఆడియన్స్ కూడా అలరిస్తున్న వెంకటేష్ కి యాక్షన్ సినిమాలో నటించాలనే ఆలోచన వచ్చినప్పుడు కథ, కథనాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టుండాల్సింది.

ఎందుకంటే ఈ కథని ఎలా చెప్పినా కూడా చెయ్యాలనే ఆసక్తి కలిగే చాన్సులు తక్కువ. అయినా కలిగిందంటే కచ్చితంగా జడ్జిమెంట్ లోపమే. 

నేపథ్య సంగీతం బాగున్నా పాటలు అస్సలు ఆకట్టుకోవు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. 

వెంకటేశ్ తన పాత్ర మేరకు చేయాల్సింది చేసాడు కానీ ఎక్కడా స్పార్క్ చూపించలేకపోయాడు. తన స్థాయికి ఇది చాలా ఈజీ క్యారెక్టర్.  

శ్రద్ధ శ్రీనాథ్ హీరో పక్కన పెయిరింగ్ కి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఉన్నట్టుంది. ఎంచుకున్న జానర్ కి తగ్గట్టుగా ఈమె పాత్రని లిమిట్ చేస్తూ లవ్ ట్రాక్, పాటలు లాంటివి పెట్టలేదు.

గాయత్రి పాత్రలో బేబీ సారాపాలేకర్ క్యూట్ గా బానే చేసింది. డాక్టర్ గా రుహాని శర్మ ఓకే. 

నవాజుద్దిన్ లాంటి ప్రతిభగల నటుడు కొన్ని చోట్ల చిరాకు తెప్పించే ఎక్స్ప్రెషన్స్ తో విసికించాడంటే దర్శకత్వలోపం ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఆర్య లాంటి నటుడిని పెట్టుకుని అతనినొక జూనియర్ ఆర్టిస్టులా వాడాడు దర్శకుడు. తెర మీద తాను ఎందుకున్నాడో తనకే డౌటొచ్చేలా ఉంది ఆ క్యారెక్టర్. 

ఆండ్రియా పరిస్థితి కూడా అంతే. విలన్ పక్కన సైడ్ కిక్ గా కనిపిస్తూ నాలుగు కిక్కులు కొట్టడానికి, పది కిక్కులు తన్నించుకోవడానికి సరిపోయింది. తాను ఉన్నంతసేపూ బబుల్ గం నములుతూనే ఉంది.

ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా మొత్తం ఫ్లాట్ గా ఒకటే మూడ్ లో నడుస్తుంది.  

ఇలాంటి సినిమా చేయడం వెంకటేష్ కి కొత్త అనుభూతి ఇచ్చిందేమో కానీ ప్రేక్షకులకి మాత్రం దుఃఖం మిగిల్చింది. 

అవసరానికి మించిన వయొలెన్స్, ఎంత విలనే అయినా నవాజుద్దీన్ నోటి వెంట అవసరం లేని బూతులు, ఎక్కడా ట్విస్టులు లేని ఫ్లాట్ నెరేషన్, ఆసక్తి గొలపని స్క్రీన్ ప్లే.. వెరసి ఈ చిత్రం ఒక హింసాత్మక సెంటిమెంట్! వెంకటేష్ తన 75 వ చిత్రంగా ఈ స్క్రిప్ట్ ని ఎందుకు ఓకే చెసాడో తెలియన అంశం. 

బాటం లైన్: హింసాత్మక సెంటిమెంట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?