ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిత్యం బూతులు తిట్టే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం అయ్యన్నపాత్రుడు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నా, ఆయన మాత్రం దయచూపలేదని సమాచారం. దీంతో కొన్ని రోజులుగా టీడీపీ కార్యకలాపాలకు అయ్యన్న దూరంగా ఉన్నారని సమాచారం.
ఉత్తరాంధ్రలో బీసీ నాయకుడిగా అయ్యన్నపాత్రుడికి టీడీపీలో మొదటి నుంచి సముచిత స్థానం వుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. నర్సీపట్నం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఎక్కువసార్లు గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి అయ్యారు. 2019లో ఓటమి పాలయ్యారు. అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండేవారు.
అయితే ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకోకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో టీడీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు టీడీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగించారు. కేశవ్‌కు తోడుగా మరికొందరు యువ టీడీపీ నేతలకు భాగస్వామ్యం కల్పించారు.
ప్రస్తుతం నర్సీపట్నం నుంచి అయ్యన్న, అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడు విజయ్‌కు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ టికెట్లతో పాటు ఇతర సమస్యలపై చంద్రబాబుతో చర్చించడానికి అయ్యన్నపాత్రుడు అపాయింట్‌మెంట్ అడుగుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, అయ్యన్నతో మాట్లాడ్డానికి చంద్రబాబు ఇష్టంగా లేరనే ప్రచారం జరుగుతోంది.
మంగళగిరిలో జరిగిన బీసీల సదస్సు, అలాగే పంచాయతీరాజ్ సదస్సుకు అయ్యన్న హాజరు కాకపోవడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబం టీడీపీలో చేరిక విషయమై తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై అయ్యన్న మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. చంద్రబాబు బహిరంగ సభలకు కూడా అయ్యన్నకు ఆహ్వానం లేదా? లేక ఆయనే వెళ్లడం లేదా? అనేది చర్చనీయాంశమైంది.
డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇస్తున్నారనే ఆవేదన అయ్యన్నలో వుంది. గంటా శ్రీనివాస్ లాంటి జంపింగ్ నేతలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. పలు అంశాలపై చంద్రబాబును నిలదీస్తారనే భయంతోనే అయ్యన్నను పూర్తిగా పక్కన పెట్టారని టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
సీనియర్ లీడర్ అయిన అయ్యన్నపాత్రుడు ప్రత్యర్థులపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటారనే చెడ్డ పేరు వుంది. ఇదే సందర్భంలో టీడీపీకి బద్ధుడై వుంటాడనే పేరు కూడా వుంది. ఇలాంటి నాయకుడికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, ఆ పార్టీలో మారిన ధోరణికి ఉదాహరణగా చెప్పొచ్చు.