దేశంలో వామపక్షాల బలం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇందుకు తెలుగు రాష్ట్రాలు మినహాయింపేమీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ దయ వల్ల కనీసం ఒక ఎమ్మెల్యే సీటైనా దక్కింది. సీపీఐ తరపున చట్టసభలో కూనంనేని సాంబశివరావు అడుగు పెట్టారు. సీపీఎం మాత్రం పట్టింపులకు పోయి పరువు పోగొట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఏపీలో కనీసం పది ఓట్లు కూడా లేని సీపీఐ స్వార్థాన్ని చూస్తే అసహ్యం కలుగుతోంది. మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఇండియా కూటమితో కలిసొచ్చే పార్టీలతోనే కలుస్తామన్నారు. బీజేపీతో టీడీపీ కలవకుంటే పొత్తు పెట్టుకుంటామన్నారు. కానీ బీజేపీ కావాలని, ఎన్నికల్లో పొత్తు మాత్రం ఉందనే ధోరణిలో బాబు వైఖరి వుందని ఆయన విమర్శించారు.
బీజేపీతో కలిసుండకపోతే పోల్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబులో కనీసం సగం కూడా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉండరన్నారు. రేవంత్‌రెడ్డిలో ధైర్యాన్ని అరువు తెచ్చుకోవాలని బాబుకు నారాయణ చురకలు అంటించారు.
టీడీపీ విషయంలో నారాయణ తన స్వార్థాన్ని బయట పెట్టుకున్నారు. ఇండియా కూటమిలో టీడీపీ లేదు. ఈ విషయం నారాయణకు తెలియంది కాదు. తెలంగాణలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, రాజకీయంగా సీపీఐ లబ్ధి పొందింది. ఇదే ఏపీ విషయానికి వస్తే, కాంగ్రెస్ బలంగా లేదని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేదనే ఉద్దేశంతో టీడీపీ కోసం సీపీఐ నేతలు వెంపర్లాడుతున్నారు.
మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇందుకు సీపీఐ దూరం జరుగుతోంది. బీజేపీతో అంటకాగే చంద్రబాబుతో సిద్ధాంతాలను పక్కన పెట్టి, జత కట్టడానికి సీపీఐ ముందుకు రావడం వారి అవకాశవాదాన్ని తెలియజేస్తోంది. మళ్లీ తెల్లారి లేచినప్పటి నుంచి రాజకీయాల్లో అవకాశవాదం, అవినీతి గురించి ఈ నాయకులే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటివి విని నవ్వుకోవడం తప్ప, చేయగలిగేదేమీ లేదు.