హనుమంతుడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ దర్శకుడికి వాచిపోతోంది. ఏ మూహుర్తాన ఆదిపురుష్ సినిమా తీశాడో కానీ, రిలీజైన రోజు నుంచి ఈ క్షణం వరకు మినిమం గ్యాప్స్ లో డైరక్టర్ ఓం రౌత్ కు చాకిరేవు తప్పడం లేదు.
ఆదిపురుష్ రిలీజైనప్పుడు, ఆ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు ఓంరౌత్ కు చివాట్లు తప్పలేదు. ఆ మధ్య అతడు 2 ఆలయాలు సందర్శించినప్పుడు, చివరికి ఇయర్-ఎండ్ డిజాస్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఓం రౌత్ కు రౌండ్ పడింది. ఇప్పుడు తనకు సంబంధం లేని విషయంలో కూడా ట్రోలింగ్ కు గురవుతున్నాడు ఈ దర్శకుడు.
ఈరోజు హను-మాన్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాలో హనుమంతుడ్ని చూపించిన విధానం, గ్రాఫిక్స్, దేవుడి చుట్టూ అల్లిన ఎమోషన్ ఆడియన్స్ కు నచ్చాయి. దీంతో అప్పటి ఆదిపురుష్ గాయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సందర్భంగా మరోసారి ఓంరౌత్ పై చీవాట్ల వర్షం కురుస్తోంది.
రూ. 600 కోట్లు పెట్టి ఆదిపురుష్ తీసిన ఓంరౌత్.. అందులో పదో వంతు బడ్జెట్ తో తీసిన హను-మాన్ సినిమాను చూసి నేర్చుకోవాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అవుతున్నారు.
ఔంరౌత్ ను ఇబ్బంది పెట్టే మరో విషయం ఏంటంటే, హను-మాన్ సినిమాకు నార్త్ బెల్ట్ లో కూడా మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతానికి ఇట్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే ఫైర్ అవుతున్నారు. ఉత్తరాది నుంచి కూడా ఆడియన్స్ ఈ కోణంలో రియాక్ట్ అయితే ఓంరౌత్ కు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.