ఎప్పుడైతే కల్కి సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారో, అప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదలవుతుందని దాదాపు అంతా ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి కారణం బ్లాక్ బస్టర్ సెంటిమెంట్.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తీసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9న రిలీజైంది, సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత ఇదే బ్యానర్ పై తీసిన మహానటి సినిమా కూడా మే 9న విడుదలైంది, సూపర్ హిట్టయింది. అందుకే ఈ బ్యానర్ పై తెరకెక్కుతున్న కల్కి సినిమాను కూడా మే 9కే విడుదల చేస్తారని అంతా భావించారు.
ఇప్పుడదే నిజమైంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్- ఫిక్షన్ మూవీ కల్కిని ఈ ఏడాది మే9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మరో సెంటిమెంట్ కూడా ఫాలో అయ్యారు. సంక్రాంతి సీజన్ లో ప్రచారం ప్రారంభించడం ఈ బ్యానర్ లో ఆనవాయితీ. కల్కి సినిమాకు కూడా అదే ఆనవాయితీ ఫాలో అయ్యారు.
ఈరోజు నుంచి కల్కి సినిమా ప్రచారం అధికారికంగా మొదలైంది. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. సినిమాలో కనిపించే రైడర్స్ లా కొంతమంది దుస్తులు ధరించి, మూవీలో వాడిన తుపాకులు పట్టుకొని ప్రచారం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ముంబయి, ఢిల్లీ, చెన్నై, మధురై, కశ్మీర్.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లో రైడర్స్ ప్రత్యక్షమయ్యారు.
ఈరోజు గుంటూరుకారం రిలీజైంది. ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో కల్కి రిలీజ్ పోస్టర్ ప్రదర్శించి, నేరుగా రైడర్స్ తుపాకులు పట్టుకొని థియేటర్లలోకి రావడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరికొంతమంది రైడర్స్ అయితే ఏకంగా షారూక్ ఖాన్ ఇంటి ముందు నిల్చొని కల్కి సినిమాకు ప్రచారం కల్పించారు. ఇలా ఓ రేంజ్ లో, వినూత్నంగా కల్కి ప్రచారం మొదలైంది.