బాలినేనికి ఆయ‌న భ‌రోసా.. జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో?

వైసీపీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్య‌క్తి. జ‌గ‌న్ కేబినెట్ నుంచి ఉద్వాస‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఏవేవో మాట్లాడుతున్నారు. బాలినేని కామెంట్స్ అధికార పార్టీకి న‌ష్టం తెచ్చేలా ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.…

వైసీపీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్య‌క్తి. జ‌గ‌న్ కేబినెట్ నుంచి ఉద్వాస‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఏవేవో మాట్లాడుతున్నారు. బాలినేని కామెంట్స్ అధికార పార్టీకి న‌ష్టం తెచ్చేలా ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సొంత పార్టీ నేత‌లే త‌న‌కు వ్య‌తిరేకంగా సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదులు చేస్తున్నార‌ని, పొమ్మ‌న‌కుండా పొగ పెడుతున్నార‌ని ఆ మ‌ధ్య మీడియా స‌మావేశంలో క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మ‌య్యారు.

ఇటీవ‌ల పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రిగా డ‌బ్బులు తీసుకున్నాన‌ని చెప్పి ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధం ఇచ్చారు. నోరు పారేసుకోవ‌డం, త‌న మాటల్ని వ‌క్రీక‌రించార‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డం బాలినేనికి అల‌వాటైంది. ఒంగోలులో ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. అలాగే ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డి లేదా ఆయ‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డికి ఇవ్వ‌క‌పోతే ప్ర‌త్యామ్నాయం చూసుకుంటామ‌ని స‌న్నిహితుల వ‌ద్ద ఆయ‌న అన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాలినేని టీడీపీలో చేరుతార‌నే పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం, ఆయ‌న ఖండించ‌డం స‌హ‌జంగా జ‌రిగిపోతోంది. బాలినేని కేవ‌లం వైసీపీ ఎమ్మెల్యే మాత్ర‌మే కాదు. సీఎం జ‌గ‌న్‌కు బంధువు కూడా. వ‌రుస‌కు సీఎంకు మామ అవుతారు. అందుకే ఆయ‌న రాజ‌కీయ పంథాపై అంత చ‌ర్చ‌, ర‌చ్చ‌.

బాలినేని టికెట్‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి ఎలాంటి స‌మ‌స్య లేద‌న్నారు. ప్ర‌కాశం జిల్లాలో బాలినేని అత్యంత విలువైన నాయ‌కుడ‌న్నారు. వైసీపీలో ఆయ‌న ప్రాధాన్యత ఎప్పుడూ త‌గ్గ‌ద‌న్నారు. బాలినేని స్థానం ఆయ‌న‌కు వుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే మూడు జాబితాలు విడుద‌ల చేశామ‌న్నారు. త్వ‌ర‌లో మ‌రో జాబితా కూడా వుంటుంద‌న్నారు.

వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి భ‌రోసా ఇవ్వ‌డం వ‌ర‌కూ ఓకే. కానీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సులో బాలినేనికి ఎలాంటి స్థానం వుంద‌నేదే ప్ర‌ధాన చ‌ర్చ‌. బాలినేనికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చేవారు. ద‌గ్గ‌రి బంధువై కూడా పార్టీకి న‌ష్టం క‌లిగించేలా నిత్యం అల‌క‌బూన‌డం, ఇత‌ర పార్టీల నేత‌ల‌తో స‌త్సంబంధాలు క‌లిగి వుండ‌డాన్ని జ‌గ‌న్ జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం. అందుకే బాలినేని టికెట్‌పై డౌట్‌. బాలినేని లేదా ఆయ‌న కుమారుడికి టికెట్ ఇవ్వొచ్చ‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.