ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనేది జగమెరిగిన సత్యం. అయితే ఆ శుభముహూర్తం ఎప్పుడనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ నాయకత్వం అప్పగించొద్దని ఆ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వారి నుంచి డిమాండ్. కాంగ్రెస్‌లో ఇలాంటివి సర్వసాధారణమే.
అయితే షర్మిలకు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తారో ఆ పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంకేతాలిచ్చారు. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా షర్మిల రాకను స్వాగతిస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత పార్టీలో పెనుమార్పులుంటాయన్నారు. దీంతో సంక్రాంతి తర్వాత షర్మిలకు కాంగ్రెస్ బాధ్యతల్ని అప్పగిస్తారని పరోక్షంగా చెప్పినట్టైంది.
షర్మిల అవసరం ఎక్కడుందో అక్కడే అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై చర్చిస్తున్నామన్నారు. వారం రోజుల్లోనే ఆ పార్టీ నేతలతో చర్చించి ఒక అవగాహనకు వస్తామన్నారు.
ఇదిలా వుండగా షర్మిల, జగన్ ఇద్దరూ ఒకటే అని, ఆమెకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్ని అప్పగించొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్‌పై గిడుగు స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.