తెలంగాణ ఫలితాలు అలా ఎందుకు వచ్చాయన్న దానిపై విశ్లేషణ రాస్తానని చెప్పి పది రోజులు దాటి పోయింది. చాలామంది పాఠకులకు యింట్రస్టు పోయి ఉంటుందని అనిపిస్తూనే ఉన్నా యిది రాస్తున్నాను. ఎందుకంటే యిదొక మంచి కేస్ స్టడీ. అభివృద్ధి, సంక్షేమం రెండూ అందించినా కెసియార్ ఎందుకు ఓడిపోయారన్నది పరిశోధిస్తే తక్కిన రాష్ట్రాల పాలకవర్గాలకు కూడా కనువిప్పుగా ఉంటుంది. దీనిలో పలువురి విశ్లేషణలు కలగలిపి రాస్తున్నాను. నిజానికి కెసియార్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి మీడియా మూగబోయింది. ఎంతసేపు చూసినా ఆంధ్రలో అది జరగటం లేదు, యిది జరగటం లేదు అని పేపర్లలో, టీవీల్లో తెగ చర్చలు జరుగుతూ వచ్చాయి కానీ తెరాస ప్రభుత్వం కూడా సమయానికి జీతాలు యివ్వటం లేదు, ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించటం లేదు, రేషన్ కార్డులు జారీ చేయటం లేదు.. యిలాటి విషయాలు చెప్పలేదు.
మీడియా వారి ఆస్తులన్నీ హైదరాబాదులో ఉండడం చేత కెసియార్ ప్రతీకార చర్యలకు భయపడి ఊరుకున్నాయని అంటూంటారు. నిజాయితీ, నిర్భీతి, ప్రజాగళం.. యిలా తమను తాము వర్ణించుకునే మీడియాకు అంత భయమైతే ఎలా? ఏమైతేనేం, కెసియార్ మీడియాను కట్టడి చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆంధ్రజ్యోతి మాత్రమే కెసియార్ చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ యిచ్చిన దగ్గర్నుంచీ, కొంత వ్యతిరేకంగా రాస్తూ వచ్చింది. ఇప్పుడు రేవంత్ వచ్చాక మరీ రెచ్చిపోతోంది. తమ మనిషిగా భావించి ప్రొజెక్ట్ చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వ యాడ్సన్నీ జ్యోతికే వస్తాయి కాబోలు. ఇదొక విచిత్రం. ఆంధ్రజ్యోతి (పూర్వావతారంలో) ఎండీ కాంగ్రెసు ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా పేపరు కాంగ్రెసుకు అనుకూలంగా ఉండేదేమీ కాదు. తర్వాతి రోజుల్లో పూర్తిగా టిడిపి పత్రిక అయిపోయింది. అలాటిది యిప్పుడు కాంగ్రెసు పత్రిక అయిపోయింది.
కెసియార్ దిగిపోయాక మాత్రమే పత్రికలన్నీ యిన్నాళ్లూ జరిగిన అవకతవ‘కతలు’ అంటూ రాస్తున్నాయి. కెసియార్ పాత సహచరులు కూడా గొంతు సవరించుకుని అనేక విషయాలు బయట పెడుతున్నారు. ఫలానాఫలానా లోపాలు జరిగాయి అని చెప్తున్నారు. కెసియార్‌తో సుదీర్ఘ కాలం నడిచిన వి. ప్రకాశ్ విశ్లేషణలు చాలా బాగున్నాయి. ఆయన మంచి చెడూ రెండూ చెప్తున్నారు. ఘంటా చక్రపాణి కూడా..! ఇవన్నీ ముందే తెలియకపోవడం చేత పారిశ్రామికీకరణ ద్వారా నగర ప్రజలను, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా ద్వారా గ్రామీణులను మెప్పించిన కెసియార్ హేట్రిక్ సాధిస్తారని, నాలా ఆలోచించే వాళ్లు ఎక్కువగా ఉంటే తెరాసకు 70-75 వచ్చినా ఆశ్చర్యం లేదు అని రాశాను. తెరాస ప్రభుత్వం ఓడిపోతుందంటూ కొందరు ఫేక్ సర్వేలు ప్రచారంలో పెట్టడం నాకు చికాకు కలిగించింది కూడా.
నేను సర్వేలేమీ చేయించలేదు కాబట్టి వ్యాసంలో నేను చేసే అబ్జర్వేషన్స్, వేసే లెక్కలు కచ్చితమనే హామీ ఏమీ లేదు అని మొదటే రాశాను. జనం యిలా అనుకుంటున్నారు అని ఎక్కడా రాయలేదు. నేను ఫీలయినదిది అని స్పష్టంగా రాశాను. ఫలితాలు వచ్చాక చూస్తే నగరవాసుల్లో చాలామంది నాలాగే ఫీలయ్యారని తేలింది. వారు అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం అనే అంశాలను పరిగణించారని అర్థమౌతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని పరిగణనలోకి తీసుకుంటూనే యితర అంశాలకు ప్రాముఖ్యత యిచ్చారని కనబడుతోంది. అందుకే తెరాస 2శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎమ్మెల్యేలను మార్చి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవనే వాదన బలంగా వినబడుతోంది. పది మంది ఎమ్మెల్యేలను మారిస్తే వారిలో 9 మంది నెగ్గారని, అదే రీతిలో 30 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే తెరాస ఓడేది కాదని అందరూ అంటున్నారు.
మా ఎమ్మెల్యే బాగా పని చేశాడు కాబట్టి తెరాసకు ఓటేస్తున్నానని నేను రాశాను. నగరంలోని తెరాస ఎమ్మెల్యేలందరూ బాగా పని చేశారనీ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలందరూ అస్సలు బాగా పని చేయలేదనీ అనగలమా? పార్టీ పుట్టిన దగ్గర్నుంచి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో తెరాస ఓడిపోవడానికి కారణం తెరాస వ్యతిరేక వేవ్ రావడం అనుకోవాలి. దక్షిణ తెలంగాణ అంటే ఉపాధి దొరకక వలసలు వెళ్లేవారికి పెట్టింది పేరు. తెరాస అక్కడ చాలా మార్పు తెచ్చి సుభిక్షం చేసింది. అయినా అక్కడా కాంగ్రెసు వేవ్‌లో చిత్తయిపోయింది. అక్కడి ఎమ్మెల్యేలందరూ దుర్మార్గులని అనడం టూ మచ్ జనరలైజేషన్. నిరంజన రెడ్డి వంటి చాలా బాగా పని చేసిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారని ప్రకాశ్ చెప్తున్నారు. కొప్పుల ఈశ్వర్ వంటి వారి విషయంలో ఎప్పుడూ ఒకరేనా? అనే ఓటర్ ఫాటిగ్ పని చేసిందన్నారు.
మొత్తం మీద చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడంతో, రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్ల వద్ద జబర్దస్తీ చేసి డబ్బులు లాగడంతో, సంక్షేమ పథకాల అమలులో కమిషన్లు కొట్టేయడంతో తెరాస ఎమ్మెల్యేలు చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారనేది అందరూ చెప్తున్నారు. కెసియార్ స్వయంగా వీటి గురించి బహిరంగంగా హెచ్చరించారని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెసుకు ఓటేసిన చాలా మంది ఓటర్లు అంతిమంగా కెసియార్ ఓడిపోతాడని ఊహించలేదని ఒక సర్వే సంస్థ నిర్వాహకుడు చెప్పాడు. ‘ఎవరికి ఓటేస్తావు?’ అంటే ‘అంతా చెయ్యే అంటున్నారుగా’ అన్నాట్ట ఓటరు. ‘అయితే కెసియార్ దిగి పోతాడా?’ అని అడిగితే ‘ఆట్టెట్ట పోతాడు, యిక్కడున్నాయనే పోతాడు’ అనేవారట. కిందివాళ్లు ఓడితే పై వాడూ కింద పడతాడని వాళ్లకి తోచలేదు. మన దగ్గర మారిస్తే చాలు. పైన ఆయన కంటిన్యూ అవ్వాలి అనుకున్నారట. అదీ తమాషా! అందుకే సర్వేలలో ముఖ్యమంత్రిగా ఛాయిస్ ఎవరు అంటే కెసియార్‌కు రేవంత్ కంటె దాదాపు రెట్టింపు శాతం మంది ఓట్లేశారు. ఆ ధైర్యంతోనే కెటియార్ ‘సిఎం అనే రెండక్షరాల పదం కన్నా కెసియార్ అనే మూడక్షరాల పదానికే ఎక్కువ పవర్ ఉంది’ అంటున్నాడు.
ఎమ్మెల్యేల మార్పు అనేది ఓటమికి గల కారణాల్లో ఒక అంశం మాత్రమే. కెసియార్ అహంకారం, అవినీతి, పథకాల అమలులో అసంతృప్తి ముఖ్యకారణాలని లోకనీతి సర్వే చెప్పినది యిక్కడ గణించాలి. నిజానికి కెసియార్ ఎప్పుడూ అహంకారే. ఉద్యమం నడిపే రోజుల్లో కూడా సహచరులు చెప్పినది వినేవాడు కాదు, తనకు చిత్తం వచ్చినట్లు చేసేవాడు. తన ఎమ్మెల్యేల చేత మాటిమాటికీ రాజీనామాలు చేయించి, ఉపయెన్నికలు తెప్పించేవాడు, వాటిలో సగంవాటిలోనే నెగ్గేవాడు. వద్దని వారించిన సహచరుల మాట పట్టించుకునేవాడు కాదు. వారంతా యితన్ని విడిచి వెళ్లిపోయారు. ఇతను ఉద్యమాన్ని యిష్టం వచ్చినట్లు నడిపాడు. ప్రొఫెసర్ జయశంకర్, కోదండరామ్, తెలంగాణ మేధావులు యిలా అనేకమంది యితనితో విసిగిపోయారు. పబ్లిగ్గా యితన్ని తీసిపారేస్తే తెలంగాణ ఉద్యమం చల్లారి పోతుందేమోనన్న భయంతో మౌనంగా భరిస్తూ వచ్చారు. ఉద్యమం ఒక దశలో క్షీణదశకు వచ్చింది. వైయస్ మరణించకుండా ఉంటే పార్టీ చీలిపోయేది, రెండు జిల్లాలకు మాత్రమే పరిమిత మయ్యేది. కానీ తెలంగాణ కాంగ్రెసు నాయకులు అధిష్టానాన్ని తప్పుదారి పట్టించిన కారణంగా, అధిష్టానం రాజకీయ బుద్ధిహీనత కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ఇక అక్కణ్నుంచి కెసియార్ అదంతా తన ప్రజ్ఞే అని చెప్పుకోసాగాడు. 2014 ఎన్నికలలో బొటాబొటీ మెజారిటీతో నెగ్గి, ఫిరాయింపులతో పార్టీని విస్తరించాడు. అమరవీరులతో సహా ఉద్యమంలో పని చేసిన వారినందరినీ పక్కన పడేశాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో పార్టీని నింపేసి, అందరికీ దోచుకునేందుకు అవకాశం కల్పించాడు. వీళ్లని మూకుమ్మడిగా బిటి (బంగారు తెలంగాణ) బ్యాచ్ అనసాగారు. కెసియార్ నవాబులాగానే పాలించాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఎప్పుడు ఆగ్రహిస్తాడో తెలియదు. ఏళ్ల తరబడి ఎపాయింట్మెంట్ యివ్వడు, అకస్మాత్తుగా పిలిచి పీట వేస్తాడు. ఎంత పెద్ద పారిశ్రామికవేత్త వచ్చినా, ఎంత ప్రముఖుడు వచ్చినా కెసియార్‌ను ఏకాంతంగా కలవడం అసంభవం అని చెప్తారు. రాజదర్బారులా పదిమంది వందిమాగధులను పక్కన పెట్టుకుని ‘ఆడియన్స్’ యివ్వడం పరిపాటి చేసుకున్నాడు.
ఫలితాలు వస్తూండగా ఒకప్పటి ఆత్మీయుడైన ప్రకాశ్ వంటి వాళ్లు ‘పొరపాట్లు జరుగుతున్నాయని మాకు తెలుసు, కెసియార్ దృష్టికి బహిరంగంగా తెస్తే ఆయనకు నచ్చదు, ఏకాంతంగా దొరకడు. ఏం చేయలేక నిట్టూర్చి ఊరుకున్నాం.’ అని చెప్పారు. ఘంటా చక్రపాణి కూడా అదే అన్నారు. తెలంగాణ ఏర్పడితే ప్రజా తెలంగాణ ఏర్పడుతుందంటూ వామపక్షవాదులందరూ కెసియార్‌ను నెత్తిన పెట్టుకుని మోశారు. సిఎం అవుతూనే కెసియార్ వీళ్లపై కేసులు పెట్టాడు, నిరసన గళాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు. ప్రదర్శనలను అనుమతించ నన్నాడు. తను ఏం చేసినా ప్రజలు ఆమోదిస్తారనే ధీమాతోనే కెసియార్ ప్రవర్తించాడు. కొలీగ్స్‌తో సహా ఎవర్నీ లెక్క చేయలేదు. సెక్రటేరియట్‌కు రాలేదు. ఫామ్‌హౌస్ నుంచే పాలించాడు. కుటుంబసభ్యులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టాడు. అయినా ప్రజలు ఆమోదించారు. 2018లో 25 సీట్లు ఎక్కువ యిచ్చి గెలిపించారు.
అందుకనే కెసియార్ అహంకారాన్ని ప్రజలు ఒక ఫ్యాక్టర్‌గా తీసుకుంటారని నేను అనుకోలేదు. పరిపాలనా దక్షతను మాత్రమే చూస్తారనుకున్నాను. ఎందుకంటే 2018లో నెగ్గాక కొన్ని నెలలపాటు కాబినెట్ ఏర్పాటు చేయనే లేదు. హరీశ్, ఈటల వంటి సమర్థులను కాబినెట్‌లోకి చాలాకాలం తీసుకోలేదు. నిక్షేపంలా ఉన్న సెక్రటేరియట్‌ని పడగొట్టి 700 కోట్ల రూ.లు వృథా చేసి కొత్తది కట్టాడు. అవసరంగా పెద్దపెద్ద విగ్రహాలు పెట్టించాడు. అయినా కొన్ని ఉప యెన్నికలలో తెరాస గెలుస్తూ వచ్చింది. పార్టీ పేరులో తెలంగాణ తీసిపారేసి, దేశం మీదకు పడ్డాడు. ఎంతో అట్టహాసంగా మహారాష్ట్రకు వెళ్లాడు.
అయినా ప్రజలు వీధుల్లోకి వచ్చి గొడవ చేయలేదు. ఈసారీ అదే జరుగుతుం దనుకున్నాను కానీ కెసియార్‌కు కాలం కలిసి రాలేదు. ప్రజలు హఠాత్తుగా మేల్కొన్నారు. ఆ విషయాన్ని గ్రహించకపోవడం చేతనే కెసియార్‌కు ధీమా పెరిగింది. ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉన్నా, తెలంగాణ జాతిపితగా ఉన్న తన మొహం చూసి ప్రజలు వాళ్లని సహిస్తారని, వారి ఆగడాలు పట్టించుకోకుండా ఆదరిస్తారని నమ్మాడు. కెసియార్‌కు ఓటమి జీర్ణం కావటం లేదట. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాతనే ప్రజల్లో మార్పు వచ్చిందని జగన్‌తో అన్నారని వార్త వచ్చింది. అంటే తన తప్పులను ఆయన తెలుసుకోలేక పోయాడు. ఆయనకు ఎవరూ చెప్పలేదనుకోవాలి లేదా చెప్పినా వినలేదనుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. ప్రత్యామ్నాయం బలంగా ఉందని తోచగానే వాళ్లకి ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు.
ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి ఉన్నంతకాలం వాళ్లకు ఆ నమ్మకం చిక్కలేదు. కాంగ్రెసు, రేవంత్ హడావుడి చూశాక, కెసియార్‌ను దింపగలగమని ధైర్యం కలిగింది, దింపేశారు. మరి కెసియార్ చుట్టూ ఉన్న ఇంటెలిజెన్సు వాళ్లు చెప్పలేదా? అవతలివాళ్లు చెప్పేది అయిష్టమైనా భరించేవాళ్లకు మాత్రమే వాస్తవాలు తెలిసి వస్తాయి. లేకపోతే వందిమాగధులు చుట్టూ చేరి, కళ్లకు గంతలు కట్టేస్తారు. తెలంగాణ ప్రజలకు తాను ఎంతో చేశాను కాబట్టి వాళ్లు చచ్చినట్లు ఓటేసి తీరతారని కెసియార్ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎమోషనల్ కాబట్టి యీ ప్రగతిని పట్టించుకోలేదని కెసియార్ పాత సహచరులు అన్నారు.
ఆంధ్రులకు, తెలంగాణ వారికి యీ విషయంలో తేడా కనబడుతుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నవారు ఎమోషన్లో పడి కొట్టుకుని పోయి, సిన్సియర్‌గా చేశారు. ఆంధ్రలో జరిగిన సమైక్య ఉద్యమంలో నిజాయితీ లేదు. రాష్ట్రం విడిపోతే తమ ప్రాంతాలూ బాగు పడతాయని, హైదరాబాదుని యుటి చేస్తే తమ రాకపోకలకు, పెట్టుబడులకు యిబ్బంది ఉండదని లోపల నమ్ముతూనే, పైకి మాత్రం సమైక్యం అంటూ వచ్చారు. హైదరాబాదు యుటి అవుతుందని వారి నాయకులు వారిని నమ్మించారు. సరే, వారి ఆశలు వమ్ము చేస్తూ కాంగ్రెసు హైదరాబాదును తెలంగాణకు యిచ్చేస్తూ విభజన చేసింది, ఆ క్రమంలో ఆంధ్రకు అన్యాయం చేసింది.
విభజన విషయంలో భగ్గుమన్న ఆంధ్రులు, విభజనకు చేసిన కాంగ్రెసుకు, సహకరించిన బిజెపికి శిక్ష వేయడంతో బాటు విభజన చేయమంటూ లేఖలు యిచ్చి, పార్లమెంటులో తన ఎంపీల ద్వారా కూడా ఆంధ్ర ఎంపీని కొట్టించిన టిడిపిని కూడా శిక్షించాలిగా! అబ్బే లేదు, అక్కడకి వచ్చేసరికి ప్రాక్టికల్‌గా ఆలోచించారు. రాష్ట్రం ఎలాగూ విడిపోయింది. విభజిత ఆంధ్రను తీర్చిదిద్దాలంటే, మంత్రిగా కూడా పనిచేయని జగన్ కంటె పదేళ్ల పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబును ఎన్నుకోవడం మంచిది అనుకుని మెజారిటీ ప్రజలు అనుకుని టిడిపికి అధికారం యిచ్చారు. ఆశలు నెరవేరక పోయేసరికి నిర్దాక్షిణ్యంగా ఐదేళ్ల కల్లా ఓడించేశారు. తెలంగాణ ప్రజలైతే కెసియార్ పట్ల విముఖత చాలా ఉన్నా, తెలంగాణ రావడానికి కారకుడు అనే సెంటిమెంటుతో 2014లో తెరాసకు ఓటేశారు. చాలా హామీలు నెరవేర్చకపోయినా 2018లో మళ్లీ అధికారం యిచ్చారు.
తెలంగాణ ప్రజలు వాస్తవాలం కంటె ప్రచారానికి లొంగుతారు అని కూడా కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. తెరాస హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరిగినా అది పట్టించుకోకుండా కెసియార్‌ది అహంకారం, అవినీతి అనే కాంగ్రెసు ప్రచారానికి లోబడ్డారు అని వారన్నారు. సునీల్ కనుగోలు కాంగ్రెసుకి అదే చెప్పాడట – ‘అభివృద్ధి, సంక్షేమం గురించి మీరు మాట్లాడితే అది కెసియార్‌కు ప్లస్సవుతుంది. అందుకని మీరు వాటి జోలికి పోకుండా కుటుంబపాలన, అహంకారం, అవినీతి వీటి చుట్టూనే మీ ప్రచారాన్ని తిప్పండి’ అని. వాళ్లు అలాగే చేశారు, కెసియార్ ఓడాడు. ఇది ఒక రకంగా పొయెటిక్ జస్టిస్. ఉమ్మడి రాష్ట్రంలో తక్కిన జిల్లాలన్నిటిని ఎండగట్టి గ్రేటర్ హైదరాబాదునే అభివృద్ధి చేశారు, ముఖ్యమంత్రి ఏ జిల్లా వాడైనా సరే! కానీ తెలంగాణ ఉద్యమం యీ అభివృద్ధిని చూపించకుండా ఆంధ్రుల అహంకారం, తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూడడం.. వీటి మీదే కథ నడిపింది. ఇక్కడి భూములన్నీ ఆంధ్రులు కబ్జా చేసేశారంది. పరిశ్రమలన్నీ వాళ్లే సొంతం చేసుకున్నారంది. మా పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే పెట్టి మీ ప్రాంతమే కదా అభివృద్ధి చేశాం అని ఆంధ్ర నాయకులు అంటే అభివృద్ధా? గాడిదగుడ్డా? మీరు కాదు, మార్వాడీలు, గుజరాతీలు నగరాన్ని అభివృద్ధి చేశారు. మీరు నగరాన్ని కాలుష్యమయం చేశారు. సాంస్కృతికపరంగా ఆంధ్రా కల్చర్‌ను రుద్ది, హైదరాబాదు తహజీబ్‌ను చెడగొట్టారు అని వితండవాదన చేశారు తెలంగాణవాదులు.
‘ఆంధ్రులు తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా యిక్కడ పెట్టడం చేతనే కదా మనకు, మన పిల్లలకూ ఉద్యోగాలు వచ్చాయి, మన ఆస్తుల విలువ పెరిగింది’ అని తెలంగాణ ప్రజలకు తోచకుండా చేసి, ఎంతసేపూ నీళ్లు, నిధులు, నియామకాలు దోచుకున్నారని, ఆంధ్రులుండగా తెలంగాణ వారికి ఏ పదవులూ, ఉద్యోగాలూ దక్కవనీ, అహంకారం చూపించారని అటువైపు దృష్టి మరలించింది. ఇప్పుడు కాంగ్రెసు కెసియార్ విషయంలో అదే చేసింది. వీళ్లు ఫ్లయి ఓవర్లు కట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం, పరిశ్రమలు పెట్టాం, చెఱువులు బాగు చేయించి, వాటర్ టేబుల్ పెంచాం అని చెప్పుకుంటూ ఉంటే అటువైపు దృష్టి పోనీయకుండా ‘కెసియార్ ఎవరినీ చూడడు, ప్రగతి భవన్‌కు యినుప గేట్లు పెట్టాడు, సెక్రటేరియట్‌కు రాడు, తెలంగాణ వచ్చాక వాళ్ల కుటుంబమే బాగుపడింది, ఒకసారి బుద్ధి చెప్పకపోతే కళ్లు నెత్తి మీది నుంచి దిగవు’ అని ప్రజలను కన్విన్స్ చేయగలిగింది.
తెరాస పాలనకు బాగా చెడ్డపేరు తెచ్చిన రెండో అంశం – అవినీతి. ఇది కూడా తెరాస అధికారంలో వచ్చిన దగ్గర్నుంచి ఉంది. సమైక్య రాష్ట్రం ఉన్నంత కాలం ఉద్యమకారులు, మీడియా ఆంధ్ర పాలకులు, సమైక్యవాదులు తెలంగాణను దోచుకున్నారు, కబ్జాలు చేశారు, అక్రమ నిర్మాణాలు కట్టారు.. అంటూ హోరెత్తించేశారు. విన్నవాళ్లకు మతి పోయేది, అంతంత దోపిడీ జరుగుతూంటే స్థానికంగా ఉన్న తెలంగాణ నాయకులు గుడ్లప్పగించి చూస్తున్నారా? దానిలో వాటాయైనా అడగలేదా? అని. ఇక్కడి పదవులు తెలంగాణ వారికే యిచ్చారుగా, వాళ్లు పాపం నోట్లో వేలేసుకుని కూచున్నారా? మేం ఎప్పుడూ వేసుకుని కూర్చోలేదని ప్రత్యేక తెలంగాణ రాగానే నిరూపించారు. ఎటు చూసినా కబ్జాలే, అక్రమ నిర్మాణాలే. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు గుంజడాలే! ఇప్పుడు నింద మోయడానికి సమైక్యవాదులు, ఆంధ్రులు లేరు కాబట్టి పార్టీల వారీగా తిట్టుకుంటున్నారు.
ఈ నాయకులు కూడా ఎక్కణ్నుంచో దిగి వచ్చినవారు కారు. దశాబ్దాలుగా ఉన్నవారే. ఆ పార్టీలోంచి యీ పార్టీలోకి, దీని లోంచి దానిలోకి దూకుతున్నారు. డబ్బు చేతులు మారకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారేనని ఎమ్మెల్యేలు చెప్పవచ్చు. మనం నమ్మవలసిన పని లేదని యిప్పుడు రేవంత్ ప్రభుత్వం రుజువు చేస్తూండవచ్చు. లేదా రుజువు చేసి కేసులు పెడతామని బెదిరించి, తెరాస ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయింపు చేసుకోవచ్చు. బంగారు తెలంగాణ అనేది ప్రజలకు సిద్ధించ లేదు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు సిద్ధించింది. గతంలో అయితే ఆంధ్ర పాలకులతో పంచుకోవాల్సి వచ్చేది, యిప్పుడా బెడద లేదు. కెసియార్ కాన్వాయ్కై 22 కార్లు కొన్నాడని యిప్పుడాశ్చర్య పడడం దేనికి? అధికారం లోకి వస్తూనే పోలీసధికారులందరికీ ఇన్నోవాలు కొన్నాడని తెలియదా? అవి వాళ్లు వ్యక్తిగతమైన పనులకు వాడుకున్నారని పేపర్లలో ఫోటోలు రాలేదా?
వర్షాకాలం వచ్చినప్పుడల్లా సిటీలో కాలనీలు మునిగిపోవడం, అక్రమ నిర్మాణాలే కారణం అని ప్రతీ ఏడూ పేపర్లలో వస్తూనే ఉందిగా! తెరాస ప్రభుత్వం ఏమైనా ఆపిందా? ఇవన్నీ తెలిసీ ప్రజలు 2018లో మళ్లీ తెరాసను హెచ్చు మెజారిటీతో నెగ్గించడంతో అవినీతి అనేది ఎన్నికల్లో ఫ్యాక్టర్‌గా ఉండబోదని నేననుకున్నాను. కానీ యీసారి అయిందంటే దానికి కారణం గత ఐదేళ్లలో హద్దు మీరిందని అనుకోవాలి. మీడియా భయపడి వివరాలు యివ్వడకపోవడంతో నా బోటి పాఠకులకు వాస్తవాలు తెలియలేదు. పత్రికలకంటే యంత్రాంగం ఉంటుంది, సోర్సెస్ ఉంటాయి, స్థానికంగా రిపోర్టర్లుంటారు. ప్రభుత్వ రికార్డులకు ఏక్సిస్ ఉంటుంది. వారు స్వతంత్రంగా విచారణ జరిపి, పేపర్లో వేయవచ్చు. మనలాటి వారికి అటువంటి వ్యవస్థ ఉండదు. పేపర్లలో, టీవీల్లో వచ్చినదాన్ని బట్టి ఒక ఊహ ఏర్పరచుకోవడం మాత్రమే చేయగలం.
తెలంగాణ మీడియా ఎంతసేపూ కెసియార్ ఈటలపై ఆరోపణలు చేశాడు, రేవంత్ మల్లారెడ్డిపై ఆరోపణలు చేశాడు అని వార్తలు వేశారు తప్ప, ఆ ఆరోపణల్లో యింత వాస్తవం వుంది, యింత కల్పన ఉంది అని ఎవరూ రాయలేదు. రిపోర్టింగు చేయడం సేఫ్, నిజానిజాలతో తామే ఆర్టికల్ వేస్తే ప్రమాదం అని భయపడ్డారు. ఇటీవల మీడియా ఎల్లెడలా యిదే ట్రిక్కు ఉపయోగిస్తోంది. తమ పక్షాన నుంచి యిన్వెస్టిగేటివ్ రిపోర్టింగు ఉండటం లేదు. ఫలానా ఆరోపణ ఫలానా ఆయనకు ఎట్రిబ్యూట్ చేస్తూ
సేఫ్ గేమ్ ఆడుతున్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలకు ప్రజలు విలువ నివ్వడం ఎప్పుడో మానేశారు. ఏమీ లేకపోయినా కూడా బురద చల్లగలరు, ఎంతో ఉన్నా తమ పార్టీలోకి వస్తున్నాడంటే కిమ్మనకుండా ఉండగలరు. స్టేట్ ఏజన్సీ, సెంట్రల్ ఏజన్సీల పనీ అలాగే ఉంది. కేసు పెడతారు, నిరూపించరు, అలా అని నిర్దోషిగా వదిలేయరు, విచారణ పేరుతో ఏళ్లు సాగదీస్తారు, కోర్టులూ అంతే, వాయిదాలు వేస్తూ, కేసును నానుస్తారు.
అందువలన ఎవరు ఎటువంటి వారో మనకు ఒక అవగాహన రావడం కష్టం. ఈలోగా మీడియా ఆరోపించేసి, విచారణ జరిపేసి, తీర్పులిచ్చేసి, శిక్షలు కూడా విధించేస్తుంది. వాళ్లకు లాయల్‌గా ఉండే పాఠకులు అది నిజమని, అదే నిజమని నమ్మి, దానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలను, విశ్లేషణలను వినడానికి నిరాకరిస్తారు. ప్రస్తుత సినారియోలో మీడియాను కట్టడి చేసి కెసియారే నష్టపోయినట్లు తేలుతోంది. లేకపోతే కొందరు ఎమ్మెల్యేలను బలి వేసి, తనను తాను కాపాడుకునే వాడు. ఇక మూడోది అత్యంత ప్రధానమైన అంశం – పథకాల అమలులో వైఫల్యం! దీని గురించి విస్తృతంగానే రాయాలి. తర్వాతి వ్యాసంలో రాస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)