గోదావరి జిల్లాల రాజకీయాలు, లేదా కులాల ఆధారంగా నడిచే రాజకీయాలలో ఇప్పుడు సరికొత్త బంధం ఏర్పడబోతోందనే వార్త సర్వత్రా వినిపిస్తోంది. ఈ కొత్త బంధం ఎలాంటిదంటే.. ఇంతకంటె దిగజారుడు బంధం సమకాలీన రాజకీయాల్లో మరొకటి మనకు కనిపించదు.
తన చేతగానితనం గురించి, అసమర్థత గురించి బూతులు తప్ప సమస్తమూ తిట్టిపోసిన పెద్దమనిషి వద్దకు జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి.. వాటేసుకుని బంధం పెంచుకోబోతున్నారు. ఎవ్వరి గురించి అయితే ఎందుకూ పనికిరాని నాయకుడంటూ దారుణంగా విమర్శించారో అదే పవన్ కల్యాణ్ పంచన చేరి.. రాజకీయంగా మళ్లీ పదవుల్లోకి రావాలని ఆ వృద్ధ నేత ఆలోచిస్తున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. ముద్రగడ పద్మనాభం.
‘కాపు జాతి.. కాపు జాతి..’ అంటూ పెద్దపెద్ద పదాలు వాడుతూ.. తన సామాజికవర్గాన్ని ఏకం చేసే పనిలో ముద్రగడ నిత్యం గడుపుతూ ఉంటారు. కాపులను బీసీలుగా గుర్తించేలా చేయడం ఒక్కటే తన జీవిత లక్ష్యం అని అంటూ ఉంటారు. చంద్రబాబునాయుడు ఆ హామీ ఇచ్చి వంచించినప్పుడు.. ఆయన పెద్ద పోరాటమే ప్రకటించారు. అయితే చంద్రబాబు సర్కారు ముద్రగడ పోరాటాల్ని, దీక్షలను అత్యంత పాశవికంగా, ఉక్కుపాదాలతో అణచివేసింది.
ఆ సందర్భంలో కాపు వర్గానికి చెందిన నాయకుడు అయి ఉండి కూడా.. చంద్రబాబుతో పొత్తుల్లో కొనసాగుతున్నందుకు.. కాపులను బీసీల్లో చేర్చకుండా వంచించిన చంద్రబాబును నిలదీయనందుకు.. ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు.
అయితే ఇప్పుడు అవసరం, అవకాశవాదం, కులం వారిని ఒక్కటి చేస్తోంది. ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ రెండు రోజుల్లో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ముద్రగడ పద్మనాభం.. కాపులను బీసీలుగా గుర్తించడం గురించి చంద్రబాబును నిలదీసినంత కాలం ఆయనను వెనుకనుంచి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా చంద్రబాబు విమర్శించేవారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరడానికి, తద్వారా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఆయన ప్రజాదరణ మీద నమ్మకం లేకపోవడంతో.. వైసీపీ పట్టించుకోలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ముద్రగడ ఫ్యాక్టర్ ను విస్మరించాలని అనుకోవడం లేదు. ఆయనను కూడా పార్టీలో కలుపుకోవాలని చూస్తున్నారు.
అదే సమయంలో, ముద్రగడ ఎప్పటిలాగా చంద్రబాబు వంచనల గురించి, మోసాల గురించి మాట్లాడకుండా ఉండేందుకు తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ఆయన వద్దకు రాయబారం వెళుతున్నారు.
ఇంతకూ కాపు జాతిని తానొక్కడే ఉద్ధరించాలని తపన పడే ఈ ముద్రగడ పద్మనాభం.. కనీసం ఈ కూటమి గెలిస్తే, రెండు మూడు నెలల్లోగా కాపులను బీసీలు చేయాలని, అలా చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ కు కండిషన్ పెట్టగలరా? కాపులపై నిజమైన ప్రేమ ఉంటే అలా చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.