టికెట్ బెంగ లేని వైసీపీ మంత్రి…!

వైసీపీలో టికెట్ల కోసం అంతా చూస్తున్నారు. వివిధ నియోజకవర్గాలలో ఇంచార్జిలను వైసీపీ అధినాయకత్వం మార్చేస్తోంది. అనూహ్యంగా కొత్త పేర్లు తెర పైకి వస్తున్నాయి. అలా రెండో జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి సిట్టింగ్…

వైసీపీలో టికెట్ల కోసం అంతా చూస్తున్నారు. వివిధ నియోజకవర్గాలలో ఇంచార్జిలను వైసీపీ అధినాయకత్వం మార్చేస్తోంది. అనూహ్యంగా కొత్త పేర్లు తెర పైకి వస్తున్నాయి. అలా రెండో జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ సీటు కూడా లేకుండా పోయింది.

కొత్త ముఖంగా మలసాల భరత్ కుమార్‌ని తెర మీదకు తెచ్చారు. ఆయనకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో మూడవ జాబితా మీద గుడివాడ అనుచరులతో పాటు అంతా ఉత్కంఠను పెంచుకున్నారు. ఈ జాబితాలో అమర్ కి ఎమ్మెల్యే టికెట్ ఏ నియోజకవర్గం నుంచి ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఆయన ఎంపీగా పోటీ చేస్తారా అన్న చర్చకు కూడా తెర లేస్తోంది.

దీని మీద మీడియాతో మాట్లాడిన మంత్రి గుడివాడ తనకు టికెట్ బెంగ లేదని తేల్చేశారు. తన రాజకీయ భవిష్యత్తు జగన్ చేతులలో ఉందని ఆయనే అంతా చూసుకుంటారని ఈ యువ మంత్రి నింపాదిగా చెప్పుకొచ్చారు.

తనకు ఏ బాధ్యతలు అప్పగించాలన్నది  జగన్ కి తెలుసు అని అందుకే తనకు ఆ విషయంలో ఏ రకమైన చింతా లేదని మంత్రి అంటున్నారు. విశాఖ జిల్లాలో అమర్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా గుడివాడకే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఆయనను జగన్ వదులుకునే ప్రసక్తే లేదని అంటున్నారు.

అనకాపల్లి ఇంచార్జి కూడా గుడివాడనే ఎంపిక చేసి జగన్ కి చెప్పారని ప్రచారంలో ఉంది. మంత్రికి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. అది గుడివాడ సొంత ప్రాంతం కావడంతో ఆయన కూడా మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. మూడవ జాబితాలో అమర్ కి పెందుర్తి టికెట్ ఖాయమని అంటున్నారు.