ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను పార్టీలోని వారు అంతా అమోదించి అమలు చేయాలని విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి దిశా నిర్దేశం చేశారు. పార్టీ మాటే ఫైనల్ అని ఆయన స్పష్టం చేసారు. అన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.
విశాఖ కార్పోరేషన్ కి చెందిన వైసీపీ కార్పోరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. గాజువాక, విశాఖ సౌత్ కార్పోరేటర్లు కూడా హాజరయ్యారు. ఇటీవల గాజువాకకు వైసీపీ కొత్త ఇంచార్జిని నియమించింది. కార్పోరేటర్ ఉరుకూటి చంద్రశేఖర్‌ని ఎంపిక చేసింది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గం కొంత అసంతృప్తికి లోను అయింది.
విశాఖ సౌత్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విషయంలోనూ కొందరు కార్పోరేటర్లు అసంతృప్తిగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇలా పార్టీలో ఉన్న గ్యాప్స్ ని తొలగించేందుకు వైవీ సుబ్బారెడ్డి ఈ మీటింగ్ నిర్వహించారని అంటున్నారు. పార్టీ గెలుపు కోసం అంతా పనిచేయాలని ఆయన కోరారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం అందరి లక్ష్యం కావాలని వైవీ సూచించారు అని అంటున్నారు. గాజువాక నుంచి ఉరుకూటికి సౌత్ నుంచి వాసుపల్లికి టికెట్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ అంతా ఒక్కటిగా ముందుకు నడచేలా వైవీ సుబ్బారెడ్డి సూచించారు అని అంటున్నారు.
పార్టీ లైన్ ఎవరైనా దాటితే వారి మీద కఠిన చర్యలు కూడా తప్పవని ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యే క్రమంలో వైవీ సుబ్బారెడ్డి కీలక నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు.