జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిలుగా ధ్రువీకరించేసిన నాయకులు అందరూ అప్పుడే కార్యరంగంలో దిగుతున్నారు. ప్రజల మన్నన పొందడానికి వ్యూహరచన చేసుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థినిన మైండ్ గేమ్ తో ఆత్మరక్షణలో పడేసే ఎత్తులు కూడా వేస్తున్నారు.
తిరుపతి అసెంబ్లీకి ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకరరెడ్డి స్థానంలో ఆయన కొడుకు భూమన అభినయ్ ను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆ చిన్న భూమన ఇప్పుడు.. తనకు ప్రత్యర్థిగా రారమ్మని జనసేనాని పవన్ కల్యాణ్ ను తొడకొట్టి ఆహ్వానిస్తున్నాడు. పవన్ కల్యాణ్ మీద గెలిస్తేనే మజా ఉంటుందని అనుకుంటున్నాడు.
పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీచేయడం అంటూ జరిగితే.. కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న సీటునే ఎంపిక చేసుకుని పోటీచేస్తారనేది అందరికీ తెలిసిన సంగతి. గత ఎన్నికల్లో కూడా కేవలం కాపు ఓట్లు అత్యధికంగా ఉన్నాయని, అవన్నీ గంపగుత్తగా తనకు పడిపోతాయనే ఆశతోనే పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం లలో బరిలోకి దిగి ఖంగుతిన్నారు.
ఈసారి ఆయన అనేక సర్వేలు చేయించుకుని కేవలం కాపు కులం ఓట్లు ఉండడం మాత్రమే కాకుండా.. అందులో తనకు పడగల ఓట్లు ఎన్ని ఉన్నాయనేది ప్రాతిపదికగా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆయన కోసం పార్టీ పరిశీలనలో నియోజకవర్గాల్లో తిరుపతి కూడా ఒకటి అని.. తెలుగుదేశంతో పొత్తు కూడా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి కూడా బలం ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఈ సంభావ్యతలన్నీ పరిశీలించిన పిమ్మట ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆలోచిస్తున్నట్టు పుకార్లు ఉన్నాయి.
ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన భూమన అభినయ్ కూడా అదే అంటున్నారు. తనకు పోటీగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీచేస్తే బాగుంటుందని ఆహ్వానిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ఒకసారి గెలిపించిన తిరుపతి ప్రజలు పశ్చాత్తాపపడ్డారని, ఈసారి పవన్ కల్యాణ్ పోటీచేస్తే అలాంటి పొరబాటు చేయకుండా.. పూర్తి నమ్మకంతో తనను గెలిపిస్తారని ఆయన అంటున్నారు.
నిజానికి తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ కు అంత నల్లేరుపై బండి నడక ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో భూమన కరుణాకర రెడ్డి కేవలం 708 ఓట్ల మెజారిటీతో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచారు. ఆ ఎన్నికల్లో తెదేపా- జనసేన కలిసి ఉంటే ఫలితం మరోరకంగా ఉండేది. ఎందుకంటే.. జనసేనకు అప్పట్లో 12వేల ఓట్లు వచ్చాయి. అయినా సరే.. జగనన్న అమలుచేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అభినయ్ అంటున్నారు.
చిన్నభూమనకు సంబంధించినంత వరకు అదొక్కటే సరిపోదు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఆయన ఎలాంటి కీర్తిని మూటగట్టుకున్నారు.. అనేది కూడా కీలకంగా మారి విజయాన్ని నిర్దేశిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇంతకూ అభినయ్ సవాలును పవన్ స్వీకరిస్తారో లేదో చూడాలి.