స‌లార్‌, గుంటూరు కారం టికెట్ల ధ‌ర‌ల పెంపుపై వివ‌క్ష!

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై ఏపీ స‌ర్కార్ నిత్యం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసే జ‌రుగుతుందా? లేదా? అనే విష‌య‌మై స్ప‌ష్ట‌త లేదు. కానీ సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు విష‌యంలో ప్ర‌భుత్వ…

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై ఏపీ స‌ర్కార్ నిత్యం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలిసే జ‌రుగుతుందా? లేదా? అనే విష‌య‌మై స్ప‌ష్ట‌త లేదు. కానీ సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు విష‌యంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు వివ‌క్ష చూపుతున్నాయ‌నే బ‌ల‌మైన వాద‌న వినిపిస్తోంది.

తాజాగా స‌లార్‌, గుంటూరు కారం సినిమా టికెట్ల ధ‌ర‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. గ‌త నెల 22న స‌లార్ సినిమా విడుద‌లైంది. ఈ సినిమా సుమారు రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. సినిమా విడుద‌లంటే ఏపీలో టికెట్ల ధ‌ర‌లు చ‌ర్చ‌కొచ్చే సంగతి తెలిసిందే. అగ్ర‌హీరో ప్ర‌భాస్ న‌టించిన సినిమా కావ‌డంతో టికెట్‌పై రూ.70 పెంచాల‌ని సినిమా నిర్వాహ‌కులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ స‌ర్కార్ మాత్రం రూ.40 పెంచింది.

తాజాగా గుంటూరు సినిమా టికెట్ల ధ‌ర పెంపు తెర‌పైకి వ‌చ్చింది. ప్రిన్స్ మ‌హేశ్ న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.140 కోట్లు అని టాలీవుడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సినిమా టికెట్‌పై రూ.50 పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై ఏపీ స‌ర్కార్ వివ‌క్ష చూపుతోంద‌న్న‌ది సినీ వ‌ర్గాల ఆవేద‌న‌.

సినిమా నిర్మాత‌లు కోరుకున్నంత కాక‌పోయినా, గిట్టుబాటు అయ్యేలా పెంచాల‌ని గ‌తంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, అగ్ర‌హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేశ్‌బాబు త‌దిత‌రులు స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో కొన్ని రోజుల పాటు వివాదం న‌డించింది.

తాజాగా ఎక్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన స‌లార్ సినిమా కంటే త‌క్కువ బ‌డ్జెట్ సినిమాకు సంబంధించి టికెట్‌పై రూ.10 ఎక్కువ పెంచ‌డం విమ‌ర్శ‌కు దారి తీసింది. గుంటూరు సినిమా టికెట్‌పై రూ.50 పెంచుకోడానికి అనుమ‌తించ‌డాన్ని స్వాగ‌తిస్తూనే, అదే రీతిలో స‌లార్ సినిమాపై కూడా ఎందుకు ద‌య‌చూప‌లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఏ ప్రాతిప‌దిక‌న స‌లార్ సినిమాకు రూ.40, గుంటూరు సినిమా టికెట్‌పై రూ.50 పెంచుకోడానికి అనుమ‌తి ఇచ్చారో చెప్పాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ విష‌య‌మై ఏపీ ప్ర‌భుత్వ వివ‌ర‌ణ తీసుకోడానికి “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధి ప్ర‌భుత్వ స‌మాచార‌శాఖ రాష్ట్ర అధికారి విజ‌య్‌కుమార్‌రెడ్డిని ఫోన్‌లో సంప్ర‌దించారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపులో వ్య‌త్యాసంపై వివ‌ర‌ణ కావాల‌ని కోర‌గా… త‌ర్వాత మాట్లాడ్తా అని ఆయ‌న ఫోన్ పెట్టేశారు.