ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వై నాట్ ఏపీ అని అంటోంది. అయితే ఏపీని విభజించిన పార్టీగా కాంగ్రెస్‌పై తీవ్రమైన ప్రజాగ్రహం వుంది. ఇప్పటికే ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికతో మళ్లీ ఆశలు చిగురించాయి.
ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని షర్మిలకు అప్పగించడమే మిగిలి వుంది. ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేనలలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇలాంటి వాళ్లందరికీ కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంలా కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున గెలుస్తామా? ఓడుతామా? అనే సంగతి పక్కన పెడితే, కనీసం తమ నాయకత్వాన్ని కాపాడుకుంటామే ఆలోచన కలుగుతోంది.
కాంగ్రెస్‌లో చేరితే తెలంగాణలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చనే ఆలోచన కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానల్లో ఒకేసారి గట్టి పోటీ ఇవ్వాలనే తలంపులో లేదు. 25 అసెంబ్లీ, మూడు లేదా నాలుగు పార్లమెంట్ స్థానాలను ఎంచుకుని మిగిలిన పార్టీలకు దీటుగా బరిలో నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడొద్దని నిర్ణయించినట్టు సమాచారం.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. బలమైన నేతలు బరిలో ఉండి, కనీసం 20-25 వేల ఓట్లు సాధిస్తారనే నమ్మకం ఉన్న నియోజకవర్గాల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా షర్మిలకు నాయకత్వం అప్పగిస్తేనే, కాంగ్రెస్ బలం పెరుగుతుందనే భావన ఆ పార్టీ నేతల్లో వుంది. డబ్బు ఖర్చు పెడితే మెరుగైన ఓట్లు సాధించే నియోజకవర్గాలేవో తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.