ఏపీలో కుల రాజకీయాలు ఉధృతమయ్యాయి. టికెట్ల మొదలుకుని, గెలుపోటముల వరకూ కులాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా కాపు నాయకుడిగా చూస్తారే తప్ప, ఆయన్ను అందరివాడని ఎవరూ భావించడం లేదు. జనసేన పేరుతో పవన్‌కల్యాణ్ పదేళ్ల క్రితం సొంత పార్టీ పెట్టుకున్నారు. సినీ, కుల అభిమానులే జనసేన బలం.
తనకు కులం లేదని, విశ్వ మానవుడినని పవన్ సినిమా డైలాగ్‌లు ఎన్ని చెప్పినప్పటికీ, ఆయన్ను కుల నాయకుడిగానే చూస్తున్నారనేది వాస్తవం. ఏపీలో ముద్రగడ పద్మనాభాన్ని కాపు ఉద్యమ నాయకుడిగా గుర్తిస్తారు, ఆ సామాజిక వర్గం గౌరవిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారంలో జనసేనాని బెంబేలెత్తారు. ముద్రగడ వైసీపీలోకి వెళితే, తన ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందని ఆయన ఆందోళన చెందారు. దీంతో కాపు పెద్దలను ఆయన మంచి చేసుకోడానికి ప్రయత్నించారు.
ఇదే సందర్భంలో కాపులపై వైసీపీ పెట్టుకున్న ఆశ ఆడియాస అవుతోంది. గత కొన్నేళ్లుగా ముద్రగడను వైసీపీ అనుకూల నాయకుడిగా చూస్తూ వచ్చారు. ఒకట్రెండు సందర్భాల్లో బహిరంగ సభల్లో తనను కించపరిచేలా పవన్ మాట్లాడారని మనస్తాపం చెందిన ముద్రగడ… ఆయనకు బహిరంగ లేఖ రాశారు. అలాగే పవన్ తీవ్రంగా తిట్టిపోసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావుకు ముద్రగడ మద్దతుగా నిలిచారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ముద్రగడ ప్రియమిత్రుడనే చర్చ మొదలైంది.
రాజకీయంగా మళ్లీ తాను యాక్టీవ్ అవుతున్నట్టు ఇటీవల ముద్రగడ బహిరంగ ప్రకటన చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని అభిమానుల్ని ముద్రగడ ఆహ్వానించారు. కొన్నేళ్లుగా ముద్రగడ టీడీపీ వ్యతిరేక పంథా, అలాగే పవన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకుని, వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ముద్రగడ వస్తే కాపుల ఓట్లు ఎన్నోకొన్ని తమకు వస్తాయని వైసీపీ ఆశించింది.
వైసీపీ ఆశలపై ఇవాళ ముద్రగడ తనయుడు గిరిబాబు నీళ్లు చల్లారు. తన తండ్రి ముద్రగడ వైసీపీలో చేరడానికి అయిష్టంగా ఉన్నారన్నారు. టీడీపీ లేదా జనసేనలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం వుందంటూ వైసీపీకి షాక్ ఇచ్చారు. తండ్రితో పాటు తాను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గిరిబాబు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ లేదా, ప్రత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
ఇంత కాలం ముద్రగడ తమ వైపే వస్తారని నమ్మకంగా ఉన్న వైసీపీ నేతలు, ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడి వైఖరి మారడానికి కారణాలేంటనే కోణంలో ఆరా తీయడం గమనార్హం.