తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబునాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శిష్యుడైన బొజ్జల సుధీర్‌ను పక్కన పెట్టి, అదే సామాజిక వర్గానికి చెందిన, వివాద రహితుడు, ధనవంతుడైన నాయకుడిని బరిలో నిలిపేందుకు చంద్రబాబు వ్యూహాత్మంగా అడుగులు ముందుకేస్తున్నారు.
శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే అందరినీ కలుపుకుని పోవడంలో సుధీర్ ఫెయిల్ అయ్యారని చంద్రబాబు భావన. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని విజయం సాధించేంత శక్తిసామర్థ్యాలు బొజ్జల సుధీర్‌కు లేవని పలు సర్వేలు చంద్రబాబుకు నివేదించాయి. శ్రీకాళహస్తిలో సుధీర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ వైసీపీ గెలుస్తుందని టీడీపీ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి.
దీంతో సుధీర్ స్థానంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం చంద్రబాబు వేట మొదలు పెట్టారు. సుధీర్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడికి టికెట్ ఇచ్చినా ప్రయోజనం లేదని బాబు గ్రహించారు. ఎస్సీవీకి బొజ్జల కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకదు. దీంతో సుధీర్‌ను కాదని ఎస్సీవికి టికెట్ ఇచ్చినా టీడీపీ ఓటమి తప్పదు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కాకుండా, మూడో వ్యక్తి, అది కూడా రాజకీయాలకు సంబంధం లేని బలమైన ఆర్థిక, సామాజిక నేపథ్యం కలిగిన నాయకుడిని తీసుకొచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో బాబు ప్రయత్నాలు కొంత వరకు ఫలించినట్టు తెలిసింది. సంక్రాంతి పండుగ తర్వాత పూర్తిస్థాయిలో శ్రీకాళహస్తిపై దృష్టి సారించి, కొత్త నాయకుడిని తీసుకురానున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. యువగళం పాదయాత్రలో టీడీపీ అభ్యర్థి తన శిష్యుడు బొజ్జల సుధీర్ అని లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
శిష్యుడు, స్నేహితుడని టికెట్లు ఇచ్చుకుంటూ పోతే, టీడీపీ అధికారంలోకి రాదని చంద్రబాబు తన కుమారుడికి హితవు చెప్పినట్టు తెలిసింది. శ్రీకాళహస్తిలో లోకేశ్ శిష్యుడికి కాకుండా, గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తారని టీడీపీ నేతల మాటే నిమయ్యేలా వుంది. సుదీర్ఘ కాలంగా టీడీపీతో ఉన్న బొజ్జల కుటుంబానికి ఈ దఫా దక్కకపోవచ్చు.