టీడీపీ వీడిన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీని వీడడమే నేరం అన్నట్టుగా ఆయనపై ఎల్లో గ్యాంగ్ ఓ రేంజ్లో మైండ్ గేమ్ ఆడుతోంది. తాజాగా కేశినేనిపై పొట్లూరి వరప్రసాద్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. గతంలో కేశినేనిపై పీవీపీ (పొట్లూరి వరప్రసాద్)వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పీవీపీ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే. వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ పీవీపీ ట్వీట్ చేశారు. కేశినేని నిన్నమొన్నటి వరకూ ట్రావెల్స్ వ్యాపారి. అందుకే కేశినేని భాషలోనే పీవీపీ వ్యంగ్య ట్వీట్ చేయడాన్ని గమనించొచ్చు. కేశినేని అనే నాయకుడు బోరుకొచ్చినట్టు పొట్లూరి దెప్పి పొడిచారు. కేశినేని బుద్ధి గురించి బెజవాడంతా తెలుసని ఆయన పేర్కొన్నారు.
సీఎం జగన్ను కలిసిన తర్వాత కేశినేని మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఎదురు దాడి మొదలైంది. చంద్రబాబు పచ్చి మోసగాడు, వంచకుడని కేశినేని విమర్శించిన సంగతి తెలిసిందే. కేశినేనిని టీడీపీ కూడా చులకనగా మాట్లాడుతోంది. కేశినేనిని తన్నాలంటే ఎక్కువ సమయం పట్టదని, కేవలం చంద్రబాబుపై గౌరవంతో ఊరుకున్నామని ఒక నాయకుడు అన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉన్న పీవీపీ కూడా సోషల్ మీడియా వేదికగా కేశినేనిని విమర్శించడం గమనార్హం. ఎన్నికలు ముగిసే వరకూ బెజవాడలో రాజకీయం వేడి మీదే వుంటుందనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. తనను టార్గెట్ చేయడంపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి.