కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైరానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఇష్టపడడం లేదు. ముద్రగడతో విభేదించడం వల్ల రాజకీయంగా తనకు నష్టం వాటిల్లుతుందని ఆయన భయపడుతున్నారు. కాపుల్లో ముద్రగడకు మంచి పట్టు వుందని ఆయన గ్రహించారు. ఇటీవల ముద్రగడను దృష్టిలో పెట్టుకునే పవన్‌కల్యాణ్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాపులంతా తనకు అండగా నిలవాలని ఆ లేఖలో కోరారు.
కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే జగన్ గట్టిగా చెప్పారని, ఆయన్ను నిలదీయాలని పవన్ ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. తాను గౌరవించే కాపు పెద్దలు దూషణలను కూడా దీవెనలుగా స్వీకరిస్తానని ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా తననెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే వుంటుందని ఆయన బహిరంగ లేఖ ద్వారా ఆహ్వానం పలికారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కు కోవద్దని కాపు పెద్దలకు ఆయన విన్నవించారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంతో చర్చించేందుకు పవన్‌కల్యాణ్ వెళ్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ హామీని అమలు చేయాలంటూ చంద్రబాబు పాలనలో ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. ఆ సందర్భంలో ముద్రగడ కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించింది. ముద్రగడ కుటుంబంలోని మహిళలను దారుణంగా హింసించింది.
అందుకే చంద్రబాబు పేరు ఎత్తితే చాలు ముద్రగడ రగిలిపోతారు. కాపులంతా ఐక్యంగా టీడీపీకి ఓటు వేస్తేనే పొత్తు సత్ఫలితాలు ఇస్తుందని చంద్రబాబు ఆలోచన. మరోవైపు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాపుల ఓట్లలో చీలిక ఏర్పడి, టీడీపీ-జనసేన కూటమికి నష్టం ఏర్పడుతుంది. అందుకే ముద్రగడ దగ్గరికి పవన్‌ను చంద్రబాబు పంపడానికి ప్లాన్ వేశారు.
బాబు సూచన మేరకు రెండు రోజుల్లో ముద్రగడను కలవడానికి పవన్ వెళ్తున్నారని చెప్పొచ్చు. ముద్రగడ దగ్గరికి చంద్రబాబు వెళ్లడానికి ధైర్యం చాలక, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్‌ను ముందుకు తోస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పవన్ రాకను ముద్రగడ ఎలా చూస్తారనేది ఆసక్తికరంగా మారింది.