వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కాంగ్రెసు పార్టీలో చేరడం అనే లాంఛనం పూర్తయింది. ఏపీ ఎన్నికల సమరాంగణంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందనేది పార్టీ కోరిక. అక్కడ గెలుపోటములతో నిమిత్తం లేకుండానే తనకు ప్రతిఫలం ఉండాలనే డీల్ కూడా కుదిరిన తర్వాతనే షర్మిల క్రియాశీలంగా రంగంలోకి దిగుతారని అనుకోవచ్చు.
వైఎస్ షర్మిలను కీలకంగా ఎన్నికల్లో మోహరించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టవచ్చుననేది వారి ఆశ. దానికి తగ్గట్టుగా ఆర్కే లాంటివారు షర్మిల వెంట కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఉత్సాహపడుతున్నారు.
షర్మిల పగ్గాలు పట్టుకుని, జగన్ ఓటు బ్యాంకును చీల్చినంత మాత్రాన కాంగ్రెసు పార్టీ ఏపీలో అధికారంలోకి రావడం అనేది భ్రమ. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ఉపయోగపడడం తప్ప వారు సాధించేదేం లేదు. అందుకే తమ మీద చంద్రబాబునాయుడుకు బీ-టీమ్ అనే ముద్ర పడకుండా ఉండేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాపం నానా పాట్లు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలను క్షోభపెడుతూ అరాచకమైన రీతిలో రాష్ట్రాన్ని చీల్చిన సంగతిని ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకుగాను.. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు కూడా. పైగా ప్రత్యేకహోదా వంటి కీలకమైన హామీని.. విభజన చట్టంలో పొందుపరచకుండా.. ఇప్పటిదాకా రాష్ట్రం తేరుకోలేని దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చి.. మమ్మల్ని గెలిపించండి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయండి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేస్తాం అనే మాట చెప్పినంత మాత్రాన తెలుగు ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమ.
తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయకుండా మిన్నకుండడం ద్వారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీకి మేలు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల తెలుగుదేశం వారందరూ తమ జెండాలు పట్టుకుని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దానికి క్విడ్ ప్రోకో గా ఏపీలో చంద్రబాబు విజయానికి తగుమాత్రం సాయం కాంగ్రెస్ చేయాల్సి ఉంది. అందులో భాగమే.. షర్మిలను తీసుకువచ్చి ఎన్నికల బరిలో మోహరించడం. ఏపీ రాజకీయాలు గమనించే పసిపిల్లలైనా.. చంద్రబాబునాయుడుకు- కాంగ్రెస్ బీటీమ్ అనే అంటారు.
అయితే ఆ ముద్ర పడకుండా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ ముగ్గురినీ ఓడించి.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపు ఇస్తున్నారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో మళ్లీ మంచిరోజులు వస్తాయంటున్నారు. మంచిరోజులు ఓకే గానీ.. అది పార్టీకో, డీల్ కుదుర్చుకునే నాయకులకో మాత్రం అర్థం కావడం లేదు.