తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెసు పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ప్రజలు వాటిని నమ్మే ఓటు వేశారో, లేదా, గులాబీల అహంకారపూరిత పరిపాలనకు బుద్ధి చెప్పాలని అనుకున్నారో గానీ.. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వందరోజుల్లోగా హామీలు అమలు చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు మాత్రం తక్షణం అమల్లోకి తెచ్చారు. మిగిలిన ప్రజాకర్షక హామీల గురించి అప్పుడే భారాస యాగీ చేయడం కూడా ప్రారంభం అయింది.
అయితే మిగిలిన అన్ని హామీల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు దాటని వారికి ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించిన హామీని ప్రభుత్వం తక్షణం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హామీ విషయంలో జాగు జరిగితే.. ప్రభుత్వానికి పరువు పోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ప్రత్యేకించి ఈ ఒక్క పథకం విషయమే ఎందుకు అనేందుకు కూడా ఒక కారణం ఉంది. కరెంటు బిల్లు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రభావం చూపించే విషయం. విద్యుత్తు టారిఫ్ పెరిగినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ నిరసనలు వ్యక్తం కావడం మనం చూస్తూనే ఉంటాం. విద్యుత్తును రాష్ట్రంలో ప్రతి వ్యక్తీ వినియోగిస్తుంటాడు కాబట్టి.. దాని మీద ఎలాంటి నిర్ణయమైనా అన్ని వర్గాల మీద ప్రభావం చూపిస్తుంది.
పైగా ఈ హామీని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే వాడారు. ఎంతగా వాడారంటే.. ఈ నెలలో రెండు వందల యూనిట్ల కంటె తక్కువ వాడినట్టు వస్తే, కరెంటు బిల్లులు మీరు చెల్లించవద్దు. డిసెంబరు 3వ తేదీ ఫలితాల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ అందరి బిల్లులు మాఫీ చేస్తాం అని రేవంత్ పదేపదే ప్రతి సభలోనూ అన్నారు. ఆ మాటల అర్థం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కూడా ధనిక, పేద తేడాలేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తామనే అర్థం.
గెలుపు తర్వాత.. రెండింటిని అమలు చేసి.. మిగిలిన వాటికోసం తెల్లరేషన్ కార్డులు ప్రాతిపదిక అని ప్రకటించారు. విద్యుత్తు బిల్లులకు కూడా తెల్లరేషన్ కార్డులే ప్రాతిపదిక అనేది వర్తిస్తుందో లేదో క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆర్థిక తారతమ్యాలు చూడకుండా అందరికీ వర్తింపజేశారు. లక్షల్లో జీతాలు తీసుకునే వాళ్లు కూడా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చు. రేవంత్ ప్రచారంలో ప్రకటించిన మాటలను బట్టి విద్యుత్తు బిల్లుల రాయితీని కూడా అలాగే వర్తింపజేయాలి. ఎటూ ధనికులు 200 యూనిట్ల కంటె తక్కువ వాడడం అనేది జరగదు.
ఇలాంటి పథకం కోసం రాష్ట్రప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాటిది తెల్ల రేషన్ కార్డులకు ముడిపెట్టడం, వందరోజులకు ముడిపెట్టడం ప్రజల ఆశలను భంగపరుస్తుంటాయి. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చి ఇంకో రెండు నెలలు లేటైందంటే.. ప్రజలంతా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. వందరోజుల్లోగా హామీల అమలు అనేది ప్రస్తుతానికి చెప్పుకోవడం బాగానే ఉంటుంది గానీ.. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోగా కొన్ని అమలు చేస్తే తప్ప.. పరువు దక్కదు.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇందులో గృహజ్యోతి గురించి కూడా చర్చ సాగినది గానీ.. తక్షణ అమలు గురించి సీరియస్ గా పట్టించుకున్నట్టు లేదు. ఈ పథకంలో ఆలస్యం చేయడం ప్రభుత్వానికి చేటు చేస్తుందని తెలుసుకోవాలి.