పెద్దలు స్మశాన వైరాగ్యం అనే పదం వాడుతుంటారు. ఎవరివైనా అంత్యక్రియల సందర్భంగా పాడె వెంట స్మశానానికి వెళ్లినప్పుడు.. మనలో కూడా ఒకింత వైరాగ్యం పుడుతుంది. ఎంత బతుకు బతికితే ఏముంది.. ఎంత సంపాదిస్తే ఏముంది.. చివరికి ఇలా ఉత్తచేతులతో స్మశానానికి చేరాల్సిందే కదా.. అని ఆ కొన్ని నిమిషాల పాటు అనిపిస్తుంది.
భవబంధాలు, ఆస్తిపాస్తులు అన్నీ తీసికట్టుగా అనిపిస్తాయి. అదంతా కూడా ఆ స్మశానంలో ఉన్నంత సేపు మాత్రమే.. అక్కడినుంచి తిరిగి ఇంటికి రాగానే.. మళ్లీ దందాలు, ఆశలు, ఆరాటాలు యథావిధిగా షురూ అవుతాయి. స్మశానంలో ఉన్నప్పుడు తాత్కాలికంగా పుట్టే ఈ వైరాగ్యాన్నే స్మశాన వైరాగ్యం అంటారు పెద్దలు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కూడా అలాంటి వైరాగ్యం ఒకటి పుట్టింది. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన చెందుతున్నారు. నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందట. గతంలో అయితే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎంతో కొంత సంపాదించుకుని మళ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టేవాళ్లట. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంపాదించుకునే అవకాశం లేకుండా పోతోందిట. ఇలాంటి రాజకీయ వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు దక్కని వాళ్లే అదృష్టవంతులట. ఇలా రకరకాలుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.
దగ్గుబాటి మాటలు వింటే వృద్ధ నారీ పతివ్రతః అనే సామెత గుర్తుకు వస్తుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ పుచ్చుకుని, రాష్ట్రమంతా ఆ పార్టీ హవా చెలరేగినా కూడా.. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలైన నాయకుడు ఆయన! గెలవడం అనేది తనకు చేతకానివిద్య అయిన తర్వాత.. ఇప్పుడు ఇలా ఎన్నికల వాతావరణమే చెడిపోయిందంటూ సుద్దులు చెప్పడం తమాషాగా ఉంది.
ఆయన భార్య మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా క్రియాశీల రాజకీయాల్లో చెలరేగిపోతున్నారు. జనసేనతో తమ పొత్తులు కొనసాగుతాయని అంటూ.. తెలుగుదేశంతో కూడా బంధం కుదుర్చుకుని.. లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగి ఎంపీగా నెగ్గాలని ఆమె ఆరాటపడుతున్నారు. ఆ రెండు పార్టీల మద్దతు ఉంటే తన గెలుపు గ్యారంటీ అని ఆమె నమ్మకం.
గెలిస్తే గనుక.. మోడీ 3.0 సర్కారులో తనను కూడా కేంద్రమంత్రి పదవి వరిస్తుందని ఆశ! ఆమె ఏ ఎన్నికల్లో సంపాదించి వెనకేసుకున్న డబ్బును ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే తెలియాలి.
అన్నింటికంటె మించిన ట్విస్టు ఏంటంటే.. పైన పేర్కొన్న వైరాగ్యం మొత్తం దగ్గుబాటికి ఎక్కడ కలిగిందో తెలుసునా? ఆయన కారంచేడు మండలం కుంకలమర్రు అనే గ్రామంలో ప్రవాసాంధ్రులు నిర్మించిన స్మశానం ఓపెనింగ్ కు వెళ్లారు. మరి స్మశానం ప్రారంభించాక ఆ మాత్రం వైరాగ్యం పుట్టకపోతే ఎలా.. సహజమే కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.