ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సీజను పరాకాష్టకు చేరుకున్నదని నమ్మడానికి మంచి గుర్తు.. అధికార విపక్షాల నుంచి పలువురి ఫిరాయింపులు, ప్రత్యర్థి పార్టీల్లో చేరడానికి ఎగబడుతూ ఉండడం. జంప్ జిలానీల సీజను టాప్ గేర్ కు మారిందంటే దాని అర్థం.. ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కిందనే.
అయితే ఈ సారి జంప్ జిలానీలను ఏకపక్షంగా నమ్మవచ్చా? అసలే పార్టీలు అధికారం కోసం అనేకానేక కుయుక్తులు, కూహకాలు పన్నుతున్న నేపథ్యంలో జంప్ జిలానీలు అందరూ విశ్వసనీయ వ్యక్తులేనా? అనేది కీలకమైన చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో చాలా మంది సిటింగ్ అభ్యర్థులకు టికెట్లు నిరాకరిస్తున్నారు. కొద్దిమందిని నియోజకవర్గాలు మారుస్తున్నారు. గెలుపు ఒక్కటే లక్ష్యంగా, సర్వేల ఫలితాలే ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి ఈ మార్పుచేర్పులు చేస్తున్నారు.
అయితే టికెట్లు నిరాకరించబడిన వారిలో చాలా మంది.. జగన్ నమ్ముతున్న సర్వేల గురించి, తమకు పలచబడిన ప్రజాదరణ గురించి తమకు కూడా క్లారిటీ ఉన్నది గనుక, ఆ నిర్ణయంతో సర్దుకుపోతున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అని అంటున్నారు. కానీ కొందరి అసంతృప్తి పరాకాష్టకు చేరి జంపింగ్ లు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు తెలుగుదేశంలోకి, వంశీకృష్ణయాదవ్ లాంటి వాళ్లు జనసేనలోకి చేరిపోయారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కూడా తెలుగుదేశంలో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నట్టే కనిపిస్తూ ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి కూడా ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని జగన్ తో భేటీ అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చంద్రబాబునాయుడు ఆయనను వెలివేసిన తర్వాత, ఇండిపెండెంటుగా అయినా విజయవాడ నుంచి మళ్లీ ఎంపీగా గెలుస్తానని సవాళ్లు విసిరిన కేశినేని నాని ఇప్పుడు జగన్ పంచన చేరుతున్నారు. నేడో రేపో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం అనే లాంఛనం కూడా పూర్తవుతుంది.
నిజం చెప్పాలంటే.. తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత.. ఇంకా పెద్దస్థాయిలోనే అసంతృప్తులు రేగుతాయి. అప్పుడు మరింత మంది తెదేపా నుంచి వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఈ జంప్ జిలానీ అందరూ నమ్మదగిన వారేనా? అనేది కీలక ప్రశ్న.
భారతీయ జనతా పార్టీలో ఉంటూ అక్కడి నుంచి కోవర్టు రాజకీయాలు చేయడానికి.. తన అనుచరులను అయిదేళ్ల కిందటే ఆ పార్టీలోకి పంపిన చాణక్య తెలివితేటలు చంద్రబాబునాయుడువి. అలాంటిది ఇప్పుడు కూడా ఆయన వైసీపీలోకి తన కోవర్టులను పంపుతున్నారేమో అనే అనుమానాలు కూడా కొందరికి కలుగుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ.. ఇతర పార్టీల్లోంచి ఈ సమయంలో ఫిరాయించి వచ్చే వారిని అతిగా నమ్మితే ముప్పు తప్పదేమోనని పలువురు విశ్లేషిస్తున్నారు.