ప్రభాస్ కు రూ.40.. మహేష్ కు రూ.50

మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక అనుమతి లభించింది. నిర్మాతలు సమర్పించిన బడ్జెట్ ఆధారంగా, గుంటూరుకారం సినిమాకు టికెట్ పై 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది సర్కారు.…

మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక అనుమతి లభించింది. నిర్మాతలు సమర్పించిన బడ్జెట్ ఆధారంగా, గుంటూరుకారం సినిమాకు టికెట్ పై 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది సర్కారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆదేశాలు జారీ చేస్తూ, జీవో విడుదల చేసింది.

తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లో గరిష్ఠ టికెట్ ధర 205 రూపాయలు అయింది. ఇక మల్టీప్లెక్స్ ప్రీమియంలో రూ.235, మల్టీప్లెక్స్ రీక్లెయినర్స్ లో రూ.355 రేట్లు ఉండబోతున్నాయి. పెంచిన ధరలు రిలీజ్ డేట్ నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఎలాంటి అదనపు ఆటలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ సినిమాకు టికెట్ పై 40 రూపాయల పెంపు ఇచ్చింది ఏపీ సర్కార్. అప్పట్లో ఈ నిర్ణయంపై ప్రభాస్ ఫ్యాన్స్ నిరసన తెలిపారు. ఇప్పుడు గుంటూరుకారం సినిమాకు కాస్త ఎక్కువగా టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.

తెలంగాణలో గుంటూరుకారం సినిమాకు భారీగా అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. 23 లొకేషన్లలో బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో 65 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో వంద రూపాయలు పెంపునకు ప్రత్యేక అనుమతులిచ్చారు.

సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రతి లొకేషన్ లో టికెట్లు 90శాతానికి పైగా అమ్ముడుపోయాయి. మరీ ముఖ్యంగా ఉదయం 4 గంటలకు, 5 గంటలకు ప్రారంభమయ్యే ఎర్లీ మార్నింగ్ షోలు పూర్తిగా ఫుల్ అయ్యాయి.