ఏపీ అధికార పార్టీని రాజకీయంగా బద్నాం చేయబోయి, జాతీయ అధికార పార్టీ బీజేపీ కమెడియన్ పార్టీగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ బీజేపీకి దగ్గుబాటి పురందేశ్వరి చీఫ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీపై ఎలాంటి ఫిర్యాదులు చేయాలనే దానిపై ఆమె దిశానిర్దేశంలోనే అన్నీ జరిగిపోతున్నాయనే అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతృత్వంలో ఫిర్యాదు చేశారు.
వైసీపీ గుర్తుపై బీజేపీ ఫిర్యాదు హాస్యాస్పదంగా వుంది. వైసీపీకి ఫ్యాన్ గుర్తు తీసేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎందుకయ్యా అంటే ప్రజా ప్రాతినిధ్యం చట్ట ప్రకారం పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీల గుర్తులు కనిపించకూడదట. ఎన్నికలు జరిగే గదుల్లో ఫ్యాన్‌లు కనిపిస్తున్నందున వైసీపీకి ఆ గుర్తు తీసేయాలనేది పురందేశ్వరి సారథ్యం వహిస్తున్న బీజేపీ ఫిర్యాదు సారాంశం.
ఒక దఫా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ప్రస్తుతం ఏపీ అధికార పార్టీగా కొనసాగుతున్న వైసీపీ గుర్తుపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం ద్వారా, కొంత కాలంగా పురందేశ్వరి అక్కసుతో చేస్తున్న విమర్శల ఎఫెక్ట్‌గానే జనం చూస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదుతో బీజేపీని అభాసుపాలు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీ కూడా ఇలాంటి ఫిర్యాదు చేయడానికి సాహసించలేదని అంటున్నారు.
ఇంకా నయం కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తమని, కావున ప్రతి ఒక్కరి చేతులు నరికేయాలని, లేదా దాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి పురందేశ్వరి ముందుకు రాలేదనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా పురందేశ్వరి డైరెక్షన్‌లోనే జరిగిందని, కనీసం నవ్వుకుంటారనే స్పృహ కూడా బీజేపీ నాయకులకు లేకుండా పోయిందని దెప్పి నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీపై అక్కసుతో బీజేపీని ఇంకా ఎలాంటి పతనావస్థకు తీసుకెళ్తారో అని పురందేశ్వరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.