ఆళ్ల‌గ‌డ్డ‌లో బాబు స‌భ అట్ట‌ర్ ప్లాప్‌… అధిష్టానం సీరియ‌స్‌!

రా…కదిలిరా నినాదంతో నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. రాష్ట్ర‌మంతా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం వెల్లువెత్తుతున్నార‌ని జోష్ మీదుండ‌గా, రాయ‌ల‌సీమ‌లో మాత్రం అందుకు విరుద్ధంగా బాబు స‌భ‌కు…

రా…కదిలిరా నినాదంతో నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. రాష్ట్ర‌మంతా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం వెల్లువెత్తుతున్నార‌ని జోష్ మీదుండ‌గా, రాయ‌ల‌సీమ‌లో మాత్రం అందుకు విరుద్ధంగా బాబు స‌భ‌కు ఆశించిన స్థాయిలో రాక‌పోవ‌డం ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆళ్ల‌గ‌డ్డ‌లో బాబు స‌భ‌కు జ‌నం భారీగా రాక‌పోవ‌డంపై క్షేత్ర‌స్థాయిలో టీడీపీ పోస్టుమార్గం చేస్తోంది.

ఆళ్ల‌గ‌డ్డ స‌భ‌కు ల‌క్ష మంది వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. తీరా చూస్తే… 20 వేల నుంచి 22 వేల వ‌ర‌కు జ‌నం వ‌చ్చి వుంటార‌ని టీడీపీ లెక్క తేల్చింది. మిగిలిన ప్రాంతాల్లో బాబు స‌భ‌కు వ‌చ్చిన జ‌నంతో పోలిస్తే, ఈ సంఖ్య చాలా త‌క్కువ‌నేది పార్టీ భావ‌న‌. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధిష్టానం దృష్టికి ప‌లు కీల‌క విష‌యాలు వెళ్లాయి. చంద్ర‌బాబు స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించేందుకు ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని తేలింది.

బాబు స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో ఆమె స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో గ్రామ‌, మండ‌ల స్థాయి నాయ‌కులు ఎవ‌రికి వారు సొంతంగా ఖ‌ర్చు పెట్టుకుని జ‌నాన్ని త‌ర‌లించాల‌ని అఖిల‌ప్రియ కోరారు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని, కొద్దోగొప్పో పెట్టుకుంటాన‌ని, మ‌రీ ముఖ్యంగా అధికారికంగా త‌న‌కు టికెట్ ప్ర‌క‌టించ‌లేద‌ని, అందువ‌ల్ల ధైర్యం చేయ‌లేక‌పోతున్న‌ట్టు కార్య‌క‌ర్త‌ల వ‌ద్ద అఖిల‌ప్రియ ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

దీంతో గ్రామ‌, మండ‌ల నాయ‌కులు త‌మ శ‌క్తి మేర‌కు బాబు స‌భ‌కు జ‌నం త‌ర‌లించారు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాబు స‌భ‌కు హాజ‌రైన వారి సంఖ్య మొత్తం 6 వేలు అని తేలింది. స‌మీపంలోని బ‌న‌గాన‌ప‌ల్లె, నంద్యాల‌, డోన్ నియోజ‌క వ‌ర్గాల నాయ‌కులు ఒక్కొక్క‌రు మూడు వేల నుంచి నాలుగు వేల మందిని త‌ర‌లించార‌ని స‌మాచారం. అలాగే నందికొట్కూరు, పాణ్యం, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు రెండు వేల నుంచి మూడు వేల మందిని త‌ర‌లించార‌ని టీడీపీ నేత‌లు తెలిపారు.  

బాబు స‌భ‌కు వ‌చ్చే వారికి క‌నీసం భోజ‌నాలు, నీళ్ల సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌లేద‌నే ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లెవ‌రూ స‌భ‌లో చెప్పుకోత‌గ్గ స్థాయిలో పాల్గొన‌లేదు. బాబు స‌భ‌కు సంబంధించి క‌నీసం స్టేజీ ఖ‌ర్చును కూడా పెట్టుకోడానికి అఖిల‌ప్రియ స‌సేమిరా అన‌డంతో, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఆ బాధ్య‌త‌ల్ని టీడీపీ అధిష్టానం అప్ప‌గించింది. ముందుగా ఖ‌ర్చు పెట్టాల‌ని, త‌ర్వాత పార్టీ ఇస్తుంద‌నే హామీతో రాంగోపాల్‌రెడ్డి స్టేజీ నిర్మాణ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించార‌ని స‌మాచారం.

ఆళ్ల‌గ‌డ్డ జ‌న‌సేన నాయ‌కుల‌తో అఖిల‌ప్రియ‌కు స‌యోధ్య లేక‌పోవ‌డం కూడా జ‌న స‌మీక‌ర‌ణ‌కు ఇబ్బంది ఏర్ప‌డింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌న‌సేన‌లో చేరిన ఇరిగెల రాంపుల్లారెడ్డికి అంతోఇంతో ప్ర‌జాబ‌లం వుంది. ఆయ‌న్ను ఆహ్వానించ‌క‌పోవ‌డంతో బాబు స‌భ వైపు ఆయ‌న క‌న్నెత్తి చూడ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి, సొంత పార్టీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డిల‌ను ఆహ్వానిస్తే, తాను బాబు స‌భ‌లో పాల్గొన‌ని అఖిల‌ప్రియ హెచ్చ‌రించ‌డంతో అధిష్టానం కాస్త వెన‌క్కి త‌గ్గింది. అయితే ఆ ప్ర‌భావం బాబు స‌భకు జ‌న‌స‌మీక‌ర‌ణ‌పై ప‌డింద‌ని టీడీపీ అధిష్టానం గ్ర‌హించింది.

ఇవే కాకుండా బాబు స‌భ‌లో వేదిక‌పై ప్రొటోకాల్‌ను కూడా పాటించ‌డానికి అఖిల‌ప్రియ అంగీక‌రించ‌లేద‌ని అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది. ప్రొటోకాల్ ప్ర‌కారం బాబు ప‌క్క‌న అఖిల‌ప్రియ‌తో పాటు జ‌న‌సేన‌, అలాగే టీడీపీకి చెందిన వివిధ సామాజిక వ‌ర్గాల నాయ‌కుల్ని కూచోపెట్ట‌డానికి జాబితాను రాబిన్‌శ‌ర్మ టీమ్ త‌యారు చేసింది.

ఈ జాబితా ఉన్న కాగితాన్ని అఖిల‌ప్రియ చింపేయ‌డంతో వివాదం త‌లెత్తింది. వేదిక‌పై బాబుకు కుడి, ఎడ‌మ‌ల వైపు తాను, త‌న భ‌ర్త‌, త‌మ్ముడు, ఆ త‌ర్వాతే ఎవ‌రైనా అని రాబిన్‌శ‌ర్మ టీమ్‌కు అఖిలప్రియ తేల్చి చెప్ప‌డంతో ఖంగుతిన్న‌ట్టుగా తెలిసింది. చివ‌రికి నంద్యాల జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు మ‌ల్లెల రాజ‌శేఖ‌ర్‌కు వేదిక‌పై కుర్చీ వేయ‌క‌పోవ‌డంపై అధిష్టానం సీరియ‌స్ అయ్యిన‌ట్టు తెలిసింది.

ఇక జ‌న‌సేన నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు చింతా సురేష్‌బాబు, ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్ మైలేరి మ‌ల్ల‌య్య‌ల‌ను బాబు ప‌క్క‌న కూచోపెట్టేందుకు అఖిల‌ప్రియ అంగీక‌రించ‌లేదు. కేవ‌లం అఖిల‌ప్రియ అహంకార ధోర‌ణితో ఎవ‌రినీ క‌లుపుకుని వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్లే అట్ట‌ర్ ప్లాప్ అయ్యిన‌ట్టు చంద్ర‌బాబుకు పార్టీ వ‌ర్గాలు నివేదించాయి. స‌భకు ఆశించిన స్థాయిలో జ‌నం రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు నొచ్చుకున్నార‌ని స‌మాచారం.