ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు పట్టారు. ఎలాగైనా ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుపట్టి, మరీ సాధించుకున్నారని సమాచారం. ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలనే చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి కోరికను జగన్ మన్నించారని, పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైవీకి రాజ్యసభ సీటు ఖరారైందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం.
2014లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డిపై వైవీ విజయం సాధించారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి… వైవీకి టికెట్ దక్కలేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంటకు టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని చివరి వరకూ వైవీ ప్రయత్నించినా జగన్ ససేమిరా అన్నారు. దీంతో అలకబూని వైవీ కొంత కాలం దేశం విడిచి వెళ్లిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ ఎంపీగా మాగుంట పార్లమెంట్‌లో అడుగు పెట్టారు.
ప్రస్తుతానికి వస్తే మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేనట్టు తెలిసింది. ఎలాగైనా మాగుంట లేదా ఆయన కుమారుడు రాఘవరెడ్డికి టికెట్ ఇప్పించాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే బాలినేని ఒత్తిళ్లకు జగన్ తలొగ్గన్నట్టు తెలిసింది. ఈ దఫా ఒంగోలు నుంచి తన చిన్నాన్న వైవీని మరోసారి బరిలో దింపాలని నిర్ణయించారని సమాచారం. టికెట్ ఇవ్వని విషయాన్ని మాగుంటకు జగన్ తేల్చి చెప్పారనే తెలిసింది. దీంతో మాగుంట రాజకీయ భవిష్యత్‌పై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
వైవీకి టికెట్ దక్కడానికి పార్టీపై నిబద్ధత, అలాగే జగన్ విషయంలో విశ్వాసంగా ఉండడమే ప్రధాన కారణంగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైవీ, బాలినేని బావాబామ్మర్దులు అయినప్పటికీ, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వాళ్లిద్దరు ఎలా పని చేస్తారనేది ఆసక్తికర అంశం. బాలినేని కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన కొట్టి పారేస్తున్నారు. వైవీకి లోక్‌సభ టికెట్‌ను అధికారికంగా ప్రకటిస్తే, బాలినేని ఎలా స్పందిస్తారో చూడాలి.