విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో విజయవాడ రాజకీయం రంజుగా మారనుంది. కేశినేని నాని, ఆయన కుమార్తె చేరికతో వైసీపీ బలం పెరగనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవచ్చనే టీడీపీ ఆశలపై నాని నీళ్లు చల్లినట్టైంది.
పార్టీ నుంచి గెంటేసిన టీడీపీపై కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత కసిగా ఉన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత టీడీపీ మేయర్ అభ్యర్థిగా సుపరిచితురాలే. 11వ డివిజన్ నుంచి గెలుపొందారు. ఇటీవల కార్పొరేషన్ పదవితో పార్టీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీలో చేరనున్న కేశినేని నాని, ఆయన కుమార్తెకు సీఎం జగన్ మంచి ఆఫర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడ లోక్‌సభ లేదా మైలవరం నుంచి పోటీ చేయడంపై ఆప్షన్‌ను వారే ఎంచుకోవాలని జగన్ సూచించినట్టు తెలిసింది. ఒకవేళ మైలవరం నియోజకవర్గాన్ని ఎంచుకుంటే, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కేశినేని నాని, ఆయన కుమార్తెను పార్టీలో చేర్చుకుని జగన్ వేస్తున్న ఎత్తుగడకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి. కేశినేని నానికి ఎంపీగా ప్రజల్లో మంచి పేరు వుంది. నాని, ఆయన కుమార్తె శ్వేత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ, పార్టీలకు అతీతంగా ఆదరణ పొందారు. రాజకీయంగా అదే వారి ఇమేజ్ను పెంచింది. టీడీపీ అవమానించడంతో వైసీపీలో చేరి, తమ సత్తా చాటాలని తండ్రీతనయ పట్టుదలతో ఉన్నారు.