రాజకీయం అంటేనే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం. రాజకీయ నాయకులకు ఎప్పుడైనా ప్రత్యర్థుల కంటే సొంత వాళ్ల నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి వుంటుంది. ప్రత్యర్థులపై క్లారిటీ వుండడం వల్ల వాళ్ల విషయంలో అప్రమత్తంగా వుంటారు. కానీ సొంత వాళ్లు నవ్వుతూనే, వెన్నుపోటు పొడుస్తుంటారు. రాజకీయంగా దెబ్బ తిన్న తర్వాత, మేల్కొని లాభం వుండదు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే… చంద్రబాబు నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజకీయంగా ప్రమాదం పొంచి వుంది. అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వంలో బుచ్చయ్య చౌదరి పని చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్గంలో బుచ్చయ్య చౌదరి కొనసాగుతున్నారు. అంటే చంద్రబాబుకు వ్యతిరేక వర్గం అన్నమాట.
1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ వైపు బుచ్చయ్య చౌదరి, పరిటాల రవి, ముద్దుకృష్ణమనాయుడు, దేవినేని నెహ్రూ తదితరులు నిలిచారు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బుచ్చయ్య తిట్టని తిట్టు లేదు. అప్పటి నుంచి బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పంచన బుచ్చయ్య చేరారు.
అయితే బుచ్చయ్య చౌదరిపై చంద్రబాబు శీతకన్నేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, అత్యంత సీనియర్ నేత అయిన బుచ్చయ్యను మాత్రం కేబినెట్‌లోకి తీసుకోలేదు. మరోవైపు వైసీపీ నుంచి వలసవెళ్లిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురికి బాబు కేబినెట్‌లో చోటు దక్కింది. దీన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో చంద్రబాబు చేసిన తప్పులపై బుచ్చయ్య ఘాటు విమర్శలు చేశారు. కనీసం చిన్నబాబు లోకేశ్ కూడా తన ఫోన్‌కాల్‌ను రిసీవ్ చేసుకోరని, ఆయనకు పెద్దాచిన్నా లేదని ఘాటు విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా టీడీపీకి గత వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేయడం చంద్రబాబు, ఆయన కుమారుడికి చిర్రెత్తుకొచ్చింది. ఒక దశలో రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తరపున కొందరు దూతలు వెళ్లి ఆయనకు నచ్చ చెప్పడంతో తగ్గారు.
ఈ నేపథ్యంలో అదును చూసి బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్‌ను శాశ్వతంగా సమాధి కట్టేందుకు చంద్రబాబు, లోకేశ్ కొత్త ఎత్తుగడ వేశారు. జీవిత చరమాంకంలో ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్‌పై జనసేన అస్త్రాన్ని తండ్రీతనయుడు ప్రయోగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాజమండ్రి రూరల్ సీటును జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారని సమాచారం.
రాజమండ్రి రూరల్ జనసేన ఇన్‌చార్జ్ కందుల దుర్గేశ్ తనకే సీటు అంటున్నారు. సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో పాటు కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని కూడా పేర్కొన్నారని కందుల దుర్గేశ్ గుర్తు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన సీటు విషయాన్ని జనసేన ఇన్‌చార్జ్ డిసైడ్ చేయడం ఏంటని బుచ్చయ్య చౌదరి మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చర్చించుకుని, ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలో తేలుస్తారని బుచ్చయ్య అంటున్నారు. అయితే తనను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయడానికే చంద్రబాబు, లోకేశ్ కుట్రపన్ని మరీ జనసేనను తెరపైకి తెస్తున్నారని సన్నిహితుల వద్ద బుచ్చయ్య వాపోతున్నారు.