జనసేనతో పుట్టే ముసలం విస్తరిస్తోంది!

పవన్ కల్యాణ్ తో పల్లకీమోయించుకోవడం ద్వారా.. కాపు కుల ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా తన ఖాతాలో పడుతుందని చంద్రబాబునాయుడు ఎలాంటి ఆశలతో ఊరేగుతున్నారో తెలియదు గానీ.. ఆ పార్టీతో పొత్తు వలన.. మొత్తానికి…

పవన్ కల్యాణ్ తో పల్లకీమోయించుకోవడం ద్వారా.. కాపు కుల ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా తన ఖాతాలో పడుతుందని చంద్రబాబునాయుడు ఎలాంటి ఆశలతో ఊరేగుతున్నారో తెలియదు గానీ.. ఆ పార్టీతో పొత్తు వలన.. మొత్తానికి తెలుగుదేశంలోనే ముసలం పుట్టడం మాత్రం తథ్యంగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తామని వారు నమ్ముతున్న స్థానాలు, గత ఎన్నికల్లో అతి తక్కవ మార్జిన్ తో ఓడిపోయిన స్థానాలను ప్రధానంగా ఈ ఎన్నికల్లో జనసేన అడుగుతోంది. అంతకంటె చోద్యం ఏంటంటే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన సిటింగ్ స్థానాల మీద కూడా జనసేన కర్చీఫ్ వేస్తోంది. మరి ఇలాంటి పరిణామాలు.. ఇరు పార్టీల మధ్య ఏర్పడిన అవకాశవాద బంధంలో ముసలం పుట్టించకుండా ఎలా ఉంటాయి.

తాజాగా రాజమండ్రి రూరల్ సీటు వ్యవహారం కొత్త వివాదంగా మారుతోంది. ఆ సీటు నుంచి తెలుగుదేశంలోని అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిటింగు ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు గ్యారంటీ అనే సిద్ధాంతంతోనే తెలుగుదేశం ముందుకు వెళుతోంది.

ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. ఇటీవల మాట్లాడుతూ, గోరంట్ల బుచ్చయ్యకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఉండదని తేల్చి చెప్పేశారు. దీనిపై గోరంట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తాజా పరిణామం.

నాకు టికెట్ ఉండదని చెప్పడానికి కందుల దుర్గేష్ ఎవరు? జనసేన మాకు కేవలం మిత్రపక్షం మాత్రమే. పెద్ద పార్టీగా తెలుగుదేశం నిర్ణయాలకు జనసేన కట్టుబడి ఉండాల్సిందే అంటూ బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు.

గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉన్నా కూడా బుచ్చయ్య గెలిచిన రాజమండ్రి రూరల్ సీటు నుంచి తాము గెలవగలమనే నమ్మకం జనసేనకు ఉంది. ఆ పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ కు ఆ నియోజకవర్గం తప్ప మరొకటి గతి లేదు. అందువల్ల బుచ్చయ్యను పక్కకు తప్పించి అయినా తనకు టికెట్ ఇప్పించాలనేది ఆయన తరఫు నుంచి పవన్ కల్యాణ్ వద్ద ఉన్న ఆబ్లిగేషన్. ఈ ఆబ్లిగేషన్ లు పొత్తులను ముంచేలా ఉన్నాయి.

ఇప్పటికే తెనాలి వంటి నియోజకవర్గాల విషయంలో ఆల్రెడీ ముసలం పుట్టే ఉంది. అక్కడ మాజీ మంత్రి ఆలపాటి రాజా వంటి సీనియర్ నాయకులు తెలుగుదేశానికి ఉన్నారు. గత ఎన్నికల్లో 17వేల స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆయనను కాదని, కేవలం 30వేల ఓట్లు తెచ్చుకున్న నాదెండ్ల మనోహర్ కు టికెట్ కావాలని జనసేన ఆశిస్తోంది.

ఇలా తెలుగుదేశం బలమైన స్థానాలనే జనసేన కోరుకుంటూ ఉండడం వారి మధ్య విభేదాలను పెంచే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.