అందరూ గుర్తుల మీద పడ్డారండోయ్!

ఏపీలో ఎన్నికలు కాక ఎక్కుతున్నాయి. తాము గెలవడం ఒక్కటే పార్టీల ప్రాధాన్యాంశం కాదు. తమ ప్రత్యర్థి గెలవకుండా అడ్డుకోవడం కూడా వారికి చాలా చాలా ముఖ్యం అవుతోంది. ఎదుటి పార్టీ గెలవకుండా ఉండాలంటే ఏం…

ఏపీలో ఎన్నికలు కాక ఎక్కుతున్నాయి. తాము గెలవడం ఒక్కటే పార్టీల ప్రాధాన్యాంశం కాదు. తమ ప్రత్యర్థి గెలవకుండా అడ్డుకోవడం కూడా వారికి చాలా చాలా ముఖ్యం అవుతోంది. ఎదుటి పార్టీ గెలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి- వాళ్ల అసమర్థతను ప్రజలకు తెలియజెప్పాలి. లేకపోతే, వాళ్లకు పడగల ఓట్లను డైవర్ట్ చేయాలి. ఈ రెండు రకాల మార్గాల మీద కూడా పార్టీలు దృష్టి పెడుతున్నాయి.

పార్టీలకు సంబంధించి ప్రజలకు అలవాటైన వాటి ఎన్నికల గుర్తులను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మళ్లీ గెలవడం కోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు అందరినీ నిర్మొహమాటంగా మార్చేస్తూ.. కొత్త వారిని అభ్యర్థులుగా మోహరించడానికి సిద్ధం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించకపోతే.. ఇక తమ పార్టీల దుకాణాలు మూసుకోవాల్సిందేనన్న భయంలో ఉన్న విపక్షాలు అప్రమత్తం అవుతున్నాయి. వైసీపీ ఓట్లకు గండికొట్టే అడ్డదార్లను అన్వేషిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి సీ-టీమ్ గా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం అధికార్లకు ఒక వింత ఫిర్యాదు అందజేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన ఫ్యాను గుర్తును తొలగించేయాలని వారు డిమాండ్ చేశారు.  ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్ బూత్ ల వద్ద పార్టీల గుర్తులు కనిపించకూడదట. అక్కడ ఫ్యాన్ లు కనిపిస్తున్నాయి గనుక వైకాపా కు ఆ గుర్తు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇంత చిత్రమైన చెత్త ఫిర్యాదు మరొకటి ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలింగు బూత్ ల ఆవరణల్లో సైకిలు కూడా అక్కడక్కడా కనిపిస్తుండవచ్చు. ప్రజలు ఎవరైనా ఓటు వేయడానికి సైకిలు మీద వస్తుండవచ్చు. అలాగని తెలుగుదేశానికి సైకిలు గుర్తును తొలగించేయాలంటే ఎలా? అదే మాదిరిగా.. కాంగ్రెసు పార్టీ గుర్తు హస్తం! పోలింగుకు వచ్చే ప్రతి మనిషికీ రెండేసి చేతులు ఉంటాయి. ఆ పార్టీ గుర్తు కనిపిస్తుంది గనుక.. కాంగ్రెస్ గుర్తు హస్తం మార్చేయాలంటే నడుస్తుందా? అనేది పలువురి సందేహం.

ఆ మాటకొస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రత్యర్థి పార్టీ గుర్తు తొలగించాలనే డిమాండ్ లేవనెత్తింది. జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుర్తుగా గాజు గ్లాసును కేటాయించడాన్ని తప్పు పడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. భారతీయ జనతా పార్టీ వైసీపీ మీద చేసిన తలాతోకాలేని ఫిర్యాదు కంటె వైసీపీ వారి ఫిర్యాదు చాలా సహేతుకమైనది.

జనసేన అనేది గుర్తింపు ఉన్న పార్టీ కాదు గనుక.. జనరల్ గుర్తు అయిన గాజు గ్లాసును రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీచేసే పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఒకే రీతిగా కేటాయించడం కరెక్టు కాదని వారు అంటున్నారు. మొత్తానికి తమ ప్రత్యర్థి పార్టీల గుర్తులను టార్గెట్ చేయడం ద్వారా.. వారి ఓటు బ్యాంకులకు గండి కొట్టాలని ఆయా  పార్టీలు భావిస్తున్నట్టుంది.