కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మాలంటే.. ఓ హమీ ఇవ్వాలి!

మేనిఫెస్టో రూపంలో ఎలాంటి మాటలు చెబుతాం అనే దాని మీదనే పార్టీలు చాలా చాలా శ్రద్ధ పెడుతుంటాయి. అత్యంత అందమైన, ఆకర్షణీయమైన హామీలను వండి వారుస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని…

మేనిఫెస్టో రూపంలో ఎలాంటి మాటలు చెబుతాం అనే దాని మీదనే పార్టీలు చాలా చాలా శ్రద్ధ పెడుతుంటాయి. అత్యంత అందమైన, ఆకర్షణీయమైన హామీలను వండి వారుస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేసింది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోను సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే కలిసి విడుదల చేసారు. ఇందులో ఎంత గొప్ప హామీలు ఉన్నాయంటే.. ఈ మేనిఫెస్టోను నమ్మితే చాలు.. ఇండియా కూటమి అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అధికారంలోకి వచ్చేయగలదు. ఈ మేనిఫెస్టోను దేశం నమ్మితే గనుక.. దేశంలో ఉండే ప్రతి మహిళ కూడా హస్తం గుర్తకు మాత్రమే ఓటు వేస్తుంది. హామీలు ఆ రేంజిలో ఉన్నాయన్నమాట.

కాంగ్రెస్ పార్టీ గనుక గెలిచిందంటే.. దేశంలోని ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు చెల్లిస్తారట. అంటే నెలకు సుమారుగా 8.5 వేల రూపాయలు ప్రతి పేద మహిళకు అప్పనంగా అందిస్తారన్నమాట. ఎనిమిదిన్నర వేలంటే.. ఇవాళ్టి రోజుల్లో చిన్నస్థాయి ఉద్యోగులు సంపాదించే మొత్తం. కేవలం ఆడవారిగా పుట్టినందుకు కాంగ్రెసు పార్టీ బేషరతుగా ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ప్రతి పేద ఇంటిలో అంటున్నారు కాబట్టి.. తెల్ల రేషన్ కార్డుతో ఈ పథకాన్ని ముడిపెడతారని మాత్రం అనుకోవచ్చు.

అయినా సరే.. మహిళా లోకాన్ని ఆకర్షించడంలో ఇది చాలా పెద్ద హామీగా పరిగణించాలి. అలాగే ఆర్థిక భారం పరంగా ప్రభుత్వానికి ఏటా కొన్ని లక్షల కోట్ల భారం పడేలా చూస్తుందని కూడా అనుకోవాలి.

ఒకవైపు మోడీ సర్కారు.. మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి చెబుతున్న మాటలు భిన్నంగా ఉన్నాయి. అసలే తాయిలాల రాజకీయాలు వద్దే వద్దని మోడీ అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెసు మాత్రం మరెవ్వరూ టచ్ చేయడానికి కూడా భయపడేంతటి భారీ తాయిలాలను ప్రకటిస్తోంది. సాధారణంగా అధికారంలో వచ్చే నమ్మకం లేని పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తుంటారు. కాంగ్రెస్ కూడా అలాంటి మాటనే చెబుతున్నదా? లేదా, నిజంగా అధికారంలోకి వచ్చి ఇవి అమలు చేయాలని అనుకుంటున్నదా? అనేది తేలాలి.

కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోకు అనుబంధంగా మరొక్క హామీ ఇస్తే తప్ప దీన్ని నమ్మలేం. ఎందుకంటే.. ఇలాంటి అలవిమాలిన హామీలు ఇస్తున్నప్పుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత.. సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఏర్పడితే వీటన్నింటినీ పక్కన పెట్టేస్తారు. కాంగ్రెస్ పార్టీగా మేం హామీ ఇచ్చాం. కాంగ్రెస్ సింగిల్ పార్టీగా ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఖచ్చితంగా అన్నీ అమలు చేసేవాళ్లం ఇప్పుడు అధికారం పూర్తిస్థాయిలో మా చేతిలో లేదు కాబట్టి సాధ్యం కాదు.. అని కాకమ్మ కబుర్లు చెబుతారు.

అందుచేత కాంగ్రెస్ ముందే ఒక మాట చెబితే తప్ప దీన్ని నమ్మలేం. కాంగ్రెస్ మాత్రమే ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా కూడా దీనిని అమలు చేస్తాం. ఈ హామీలన్నింటికీ సంకీర్ణంలోని ఇతర పార్టీలు ఒప్పుకుంటే తప్ప.. వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయం -అని ముందే చెప్పాలి. అలా చెప్పకపోతే గనుక.. ఎన్నికల తర్వాత ప్రజలను వంచించడానికి అనుగుణంగా ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించినట్టు అనుమానించాల్సి వస్తుంది.