మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ఎంతో కసిగా వుంది. ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కూటమి తరపున కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలో దిగిన సంగతి తెలిసిందే. నల్లారి కిరణ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో ఇద్దరూ కాంగ్రెస్‌లో వున్నప్పుడు కూడా వర్గపోరు కొనసాగింది.
వైఎస్సార్ వర్గంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఉండేవారు. వైఎస్సార్ వ్యతిరేక వర్గంలో పెద్దిరెడ్డి ఉంటూ, చిత్తూరు జిల్లాలో అసమ్మతి రాజకీయాలకు నాయకత్వం వహించారు. అయితే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి వైఎస్ జగన్‌తో సన్నిహిత సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి. తన తండ్రి వైఎస్సార్‌కు చెప్పి, పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇప్పించారనే ప్రచారం వుంది. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ ఆయన పేరుతో పార్టీ పెట్టారు.
వైసీపీలోకి పెద్దిరెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి హవా కొనసాగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం సాగుతోంది. ఇప్పుడు నేరుగా ఎన్నికల్లో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం పెద్దిరెడ్డి కుటుంబంపై కిరణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇందుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ కిరణ్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని కసిగా చెప్పారు. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రుల్ని ఓడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి అదే గతి పట్టిస్తామని బలమైన హెచ్చరిక చేయడం విశేషం. వైఎస్ వైఎస్ జగన్‌ను కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వేధించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజనకు కిరణే కారణమని పెద్దిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ తర్వాత నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని ఘాటు విమర్శ చేశారు.