మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరుగురు కారణమయ్యారని చెబుతారు. అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ అంటారు. కర్ణుడి చావుకు ఆరుగురు కారణమైనట్లే గులాబీ పార్టీ చావుకు అంటే దుస్థితికి ఎన్ని కారణాలున్నాయి? పార్టీ నాయకుల్లోనే తలా ఒక కారణం చెబుతున్నారు.
పార్టీ నాయకులు కాకుండా రాజకీయ విశ్లేషకులు ఇంకొన్ని కారణాలు చెబుతున్నారు. విశ్లేషకులు చెబుతున్న కారణాలు సమంజసంగా ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వాళ్లేమంటున్నారు? కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అహంకార ధోరణి, అవధులు లేని అవినీతి, ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు విచ్చలవిడిగా సాగించిన దోపిడీ ఇల్లాంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు.
దానికి తగ్గట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. ప్రజలు తెలివైనవారు. ఈ అరాచకాలన్నీ గమనించే గులాబీ పార్టీని చిత్తుగా ఓడించారు. నాయకులు అవకాశవాదులు కాబట్టి పార్టీ ఓడిపోగానే ఫిరాయింపులు స్టార్ట్ చేశారు. కేసీఆర్ కూతురు కవిత కూడా జైలుకు వెళ్ళింది.
ప్రస్తుతం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కానీ కేసీఆర్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ, నాయకులుగానీ ఆత్మవిమర్శ చేసుకోవడంలేదు. యేవో పనికిమాలిన కారణాలు చెప్పుకుంటున్నారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినదన్నట్లుగా రోజూ విరుచుకుపడుతున్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినందువల్లనే, తెలంగాణా సెంటిమెంటును వదిలేసినందువల్లనే పార్టీ ఓడిపోయిందని నాయకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపామని, కానీ దాన్ని ప్రజలకు చెప్పుకోలేకపోయామని కేటీఆర్ మరో దిక్కుమాలిన వాదన వినిపిస్తున్నాడు.
ఇక బాస్ కేసీఆర్ వాస్తును పట్టుకున్నాడు. తెలంగాణ భవనంలో వాస్తు లోపాల కారణంగానే పార్టీ ఓడిపోయిందని, దుస్థితి దాపురించిందని వాస్తు పండితులు ఆయనకు నూరిపోశారు. ఆయనకు అసలే వాస్తు పిచ్చి ఎక్కువ కాబట్టి వెంటనే మార్పులు చేర్పులు చేయాలని చెప్పాడు.
తెలంగాణ భవనంలో ఆగ్నేయం నుంచి నడవడమే కొంప ముంచిందని ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాజకీయాల్లో మన నడక, నడత బాగున్నప్పుడు తెలంగాణ భవనంలో ఎట్లా నడిస్తే ఏముంది? ఈ చిన్న లాజిక్ గ్రహించలేని కేసీఆర్ వాస్తు మార్పులు చేయిస్తున్నాడు. ఇది ఆయనకు కొత్త కాదు.
మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వాస్తు బాగాలేదనే కారణంతో అప్పటి సచివాలయానికి కూడా రాలేదు. కొత్త సెక్రటేరియట్ కట్టిందాకా నిద్రపోలేదు. మరి ఇప్పుడు చేస్తున్న వాస్తు మార్పుల వల్ల పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందా?