Advertisement

Advertisement


Home > Movies - Reviews

The Family Star Review: మూవీ రివ్యూ: ది ఫ్యామిలీ స్టార్

The Family Star Review: మూవీ రివ్యూ: ది ఫ్యామిలీ స్టార్

చిత్రం: ది ఫ్యామిలీ స్టార్
రేటింగ్: 2.25/5
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వెన్నెల కిషోర్, జగపతి బాబు, రోహిణి హట్టంగడి, అచ్యుత్ కుమార్, వాసుకి, అభిరామి, రవి ప్రకాష్, చెంబోలు రాజా తదితరులు 
సంగీతం: గొపీ సుందర్
కెమెరా: మోహనన్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్
ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్.ప్రకాష్
నిర్మాతలు: రాజు- శిరీష్
దర్శకత్వం: పరశురామ్ 
విడుదల: 5 ఏప్రిల్ 2024

చాలానాళ్ల తర్వాత "గీతగోవిందం" కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ- పరశురామ్ కలిసి ముందుకొచ్చారు. పాటలు ఎక్కేసాయి. ట్రైలర్ అకట్టుకుంది. విజయ్ కి ఈ సినిమాతో ఆగిన "హిట్" వేవ్ మళ్లీ పైకి లేస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ హిట్ వేవ్ తో పైకి లేచిందా లేక హీట్ వేవ్ తో కింద పడేలా ఉందా చూద్దాం. 

గోవర్ధన్ (విజయ్) ఒక పెళ్లికాని మధ్యతరగతి యువకుడు. అతనికి ఇద్దరన్నయ్యలు (రవిప్రకాష్, చెంబోలు రాజా), ఇద్దరు వదినలు (వాసుకి, అభిరామి), ఒక బామ్మ (రోహిణి హట్టాంగిడి). 

గోవర్ధన్ చాలా పొదుపరి. ఎందుకంటే రెండు కుటుంబాల బాధ్యత తన మీదే ఉంది. అన్నయ్యల నుంచి సంపాదనేమీ ఉండదు. పైగా ఒక అన్నయ్య తాగుబోతు. కొంప గురించి అసలేం పట్టించుకోడు.

ఇందు (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి ఇతని ఇంట్లో పైన పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతుంది. మొదట కుటుంబానికి, తర్వాత అతనికి దగ్గరవుతుంది. కానీ ఆమె దగ్గరవడానికి కారణం ఒక థీసిస్ వర్క్ అని తెలుస్తుంది.

దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆ తర్వత ఏర్పడే ట్విస్టుల మధ్య ఈ ఇద్దరూ తమ పొరపొచ్చాలని ఎలా సరి చేసుకుంటారు అనేది తక్కిన కథ!

ఇన్నేసి పాత్రలతో కూడిన ఈ కథని మూడు గంటల సినిమాగా తీసి చుట్టేయకుండా నింపాదిగా, విపులంగా తీసుండుంటే 1000 ఎపిసోడ్స్ సీరియల్ అయ్యేది. ప్రతి పాత్రకీ న్యాయం చేయడానికి తగినంత సమయం చిక్కేది. "కార్తీక దీపం" సీరియల్లో "డాక్టర్ బాబు- వంటలక్క" టైపులో "ఆర్కిటెక్ట్ బాబు- థీసిస్ అక్క" గా నటీనటులు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకునే వారు. టైటిల్ కూడా "ఇందుగోవర్ధనం" అని పెట్టుకోవచ్చు.

ఈ చిత్రంలో అన్ని పాత్రలు పెట్టినా ఎవరికీ న్యాయం చేయలేదు. సివిల్స్ కి ప్రిపేరవుతూ తమ్ముడు మీద ఆధారపడే అన్నయ్య ఒక్కమాటేదో అన్నందుకే తాగుబోతయిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అలాగే రెండో అన్నయ్య ఏం చేస్తుంటాడో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఏదో రెండు సీన్స్ లో తప్ప అసలు ఈ కుటుంబంలో కనిపించనే కనిపించడు.

అభిరామిని ఒక వదినగా చూపించినా ఒక సీన్లో దోసెలు వేయడం తప్ప చేయించిందేమీ లేదు.

వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ఉన్నా నవ్వించడానికి మేటర్ లేదు.

జగపతిబాబు, "కాంతార" అచ్యుత్ కుమార్ లకి మేకప్ వేసినంత సేపు కూడా కనపడరు తెర మీద.

సినిమా మొత్తం విజయ్ దేవరకొండ మీదే నడపాలనుకుని నడిపినట్టుంది. మృణాల్ ఠాకూర్ కి ప్రధామార్ధంలో తప్ప ద్వితీయార్ధంలో నటించే అవకాశమే లేకుండా అయింది. 

సినిమా అన్నాక ఫ్లోలో నాన్- సింక్ కొట్టకూడదు. అప్పటివరకు కుటుంబరావులాగ కనిపించే కథానాయకుడు సడెన్ గా ఒక ఫైట్ చేయాల్సివస్తే చేయొచ్చు. కానీ అది మరీ హై వొల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మాదిరిగా ఉంటే సదరు హీరో ఫ్యాన్స్ కి కూడా ఈలలు వేసే మూడ్ రాదు. 

ఇందులో ఇంకో ఓవర్డోస్ అంశం ఏంటంటే... హీరో హీరోయిన్ ని, హీరోయిన్ హీరోని, హీరోయిన్ కమెడియన్ ని, అన్నయ్య హీరోని.. ఇలా ఒకర్నొకరు ఛెళ్ళుమని చెంపదెబ్బలు కొట్టేసుకుంటూ ఉంటారు. 

ఇదంతా ఒకెత్తైతే సెకండాఫులో హీరోగారు అమెరికాలో ఒకడిని చావ చితక్కొట్టేస్తాడు. ఇంతకీ అతను చేసిన పనేంటంటే అమ్మాయి బాగుందని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో పెద్దవాళ్లకి చూపించడానికి చాటుగా ఫోటో తీస్తాడు. అతను చేసిన పనికి హీరో చేసిన అతి చూస్తే ఫ్యామిలీ స్టార్ లా కాకుండా "జూనియర్ యానిమల్" టైపులో కనిపిస్తాడు. 

దర్శకుడు యాక్షన్ ఏం చెయ్యాలో చెప్పలేదో లేక స్క్రిప్ట్ అర్ధం కాలేదో కానీ సెకండాఫ్ మొత్తం హీరోయిన్ ఎక్స్ప్రెషన్ లేని మొహంతో పని కానిచ్చేసింది. హీరోకి రక్తం కారుతున్నా, తన చుట్టూ ఏం జరుగుతున్నా కూడా రేసుగుర్రంలో శ్రుతిహాసన్ లాగ స్టోన్ ఫేస్ వేసుకుని చూస్తూ ఉంటుందంతే. 

2 గంటల 45 నిమిషాల "అతి తక్కువ నిడివితో" సినిమాని పూర్తి చేసే ఆలోచనతో అనుకుంటా దర్శకుడు కొన్ని సీన్స్ ని చాలా ఫాస్ట్ గా మొదలుపెట్టి ముగించాడు. ఉదాహరణకి హీరోకి తన అన్నయకి మధ్యన గొడవ దేనికి జరిగిందో రోహిణి హట్టంగడి పాత్ర ఫ్లాష్ బ్యాక్ విప్పడం మొదలెట్టగానే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టంత కథ చెప్తుందేమోనని కంగారొస్తుంది. కానీ ఏమీ కంగారు పెట్టకుండా అత్యంత పేలవమైన కారణాన్ని అరనిమిషంలో చెప్పి ముగిస్తుంది. అంత దానికే ఆ అన్నగారు అంత తాగుబోతు అయిపోయాడా అని ప్రేక్షకులు నొసట్లు చిట్లించి చూడాలంతే. 

అలాగే సెకండాఫ్ చివర్లో ఒక పాత్రలో (కాంతారా అచ్యుత్ కుమార్) మార్పు ఐదంటే ఐదే సెకన్లలో చటుక్కున వచ్చేస్తుంది. అంతటి సున్నితమనస్కులైన పాత్రలు ఇందులో ఉన్నాయి. 

సాంకేతికంగా చూసుకుంటే గోపీసుందర్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. కానీ "కళ్యాణీ వచ్చా వచ్చా.." పాటని ఎక్కడ పెట్టాలో తెలీకో, నిడివి ఎక్కువయిందనో రోలింగ్ టైటిల్స్ అప్పుడు వేసారు. అది మొదలవ్వగానే ఇక లేవండంటూ లైట్స్ కూడా వేసేసారు హాలు వాళ్లు. రెండూ ముప్పావు గంటల సినిమా మరి! 

కెమెరా పనితనం, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్  పదునుగా ఉంటే బాగుండేది. రెండంటే రెండే పాటలున్నా అంత సేపు సినిమా నడిచిందంటే టాకీ పార్ట్ ఎంతుందో ఊహించుకోవచ్చు. ఇందులో చెప్పుకొదగ్గ గ్రిప్పింగ్ నెరేషన్ ఇంటెర్వల్ ముందు వచ్చే సుమారు 20 నిమిషాల కథనం మాత్రమే. 

"ఫ్యామిలీ స్టార్" టైటిల్ తో సినిమా అని చెప్పి చక్కటి వినసొంపైన పాటల్ని విడుదల చేసారు. ఆసక్తి, అంచనా పెంచారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని తొలి రోజే థియేటర్ వరకు రప్పించగలిగారు. దానికి కారణం రెండు వరుస హిట్లు కొట్టిన మృణాల్ ఠాకూర్, క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ జంటగా కనిపించడం కూడా. అలా వచ్చిన ఆడియన్స్ ఆశించేది కేవలం రెండు మూతి ముద్దులు కాదు... కనీసంలో కనీసం 50% నవ్వులు. ఇందులో అది 5% కూడా లేదు. సినిమాలో బాగున్నదెక్కడో చెప్పాలంటే సినిమా మొదలైన గంట నుంచి ఇంటెర్వల్ వరకు అని చెప్పాలి. దాని ముందు, దాని తర్వాత అంతా డల్ గానే ఉంది. 

బాటం లైన్: మెరవని స్టార్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?