ఏపీ రాజకీయాల్లో బదిలీల పర్వం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవల ముగ్గురు ఐఏఎస్, ఐదారుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు అధికారులను కూటమి టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ అవుతారనే చర్చ బలంగా సాగుతోంది.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ అయితే, ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వ బద్ధ శత్రువైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వస్తారని ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అసలు ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అయ్యే అవకాశాలున్నాయా? అనే అంశంపై లోతుగా అధ్యయనం చేయగా, అలాంటి అవకాశాలే లేవని స్పష్టమైంది.
ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ నెల 13న ఆయన క్యాట్‌పై విచారణ, తీర్పు వెలువడుతుందని, క్లీన్ చిట్ లభిస్తే ఆయన డీజీపీ అవుతారనేది ప్రధాన ప్రచారం. ఒకవేళ ఆయనకు క్యాట్ క్లీన్‌చిట్ ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ డీజీపీ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారిని ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేపీ చేసే అవకాశమే లేదని అత్యున్నత పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్‌కు విదేశాల నుంచి తన కుమారుడి కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని ఏబీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై జగన్ ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసు న్యాయ వ్యవస్థ పరిధిలో వుంది.
రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పిస్తే… ఏబీ వెంకటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు సీనియర్లని ఎల్లో మీడియా చెబుతోంది. కావున ఏబీ వెంకటేశ్వరరావునే ఈసీ ఎంపిక చేస్తుందనేది ప్రధాన వాదన. కానీ క్రిమినల్ కేసున్న ఏబీనీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోదు. అంతేకాదు, గత ఎన్నికల్లో ఏబీనీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎన్నికల సంఘం తప్పించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రాజేంద్రనాథ్‌రెడ్డిని తొలగించాలని ఈసీ అనుకుంటే… ద్వారకా తిరమలరావు వైపే ఈసీ మొగ్గు చూపుతుంది. ఆయనకు క్లీన్ ఇమేజ్ వుంది. కావున ఏబీ వెంకటేశ్వరరావు వస్తాడనే పగటి కలలను మానుకుంటే వారికే మంచిది.